వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఏ పార్టీతోనైనా కలిసి పోటీ చేస్తాడా? లేక మళ్లీ ఒంటరిగానే బరిలోకి దిగుతాడా? ఈ రెండు ప్రశ్నలు గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తరచుగా వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ప్రజాసంకల్ప యాత్రలో బుధవారం జగన్ చేసిన ప్రకటన తాను ఒంటరిగా పోటీ చేసేందుకే సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. జగన్ వ్యూహాలు, ఆయన అడుగులు కూడా కొద్ది రోజులుగా అలాగే ఉంటున్నాయి. రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి, బద్ధ శత్రువైన టీడీపీయే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మొద్దని ఆయన పిలుపిచ్చారు. చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్‌ను నమ్మవద్దని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఈ నాలుగు మాటల ద్వారానే వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వైఖరిని దాదాపు జగన్‌మోహన్‌రెడ్డి బయటపెడుతున్నారని, పొత్తు ఉండదని పార్టీ వర్గాల్లో వినవస్తున్నది.
పవన్ కళ్యాణ్‌తో కలిసి జగన్ పోటీ చేస్తారని మొన్నటివరకూ జరిగిన ప్రచారం నిజం కాదని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. అధికార పక్షంపై స్వల్ప స్థాయిలో, జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పవన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్దిరోజులుగా ఎదురుదాడి చేస్తున్నారు. చివరికి అది చంద్రబాబుకు అనుకూలంగానే పవన్ రాజకీయాలు చేస్తున్నాడని, పవన్ కూా బాబు మనిషేనని వరకూ వెళ్లింది. ఈ పరిణామాలను బట్టి పవన్, జగన్ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపించడంలేదు. ఈ మధ్య జగన్ మీద పవన్ దాడి ఉధృతం చేయడం, జగన్ కూడా పవన్ ను ఏ మాత్రం పట్టించుకొనకపోవడం వారిద్దరి మధ్య సఖ్యత కష్టమనేందుకు నిదర్శనం.
కాంగ్రెస్, టీడీపీ వచ్చే ఎన్నికల్లో నేరుగానో, లోపాయికారీగానో కలిసి పోటీ చేసేందుకు రంగం సిద్ధమవడంతో వారిని ఎదుర్కొనేందుకు జగన్ ఇప్పటికే వ్యూహం రూపొందించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక బీజేపీతో జగన్‌కు రహస్య అవగాహన ఉందని టీడీపీ ప్రచారం చేస్తున్నా దానిపై రెండు పార్టీలు సరిగా స్పందించడంలేదు. బీజేపీతో జగన్ కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపించడంలేదు. కానీ తనకు, బీజేపీకి ఉమ్మడి ప్రత్యర్థులుగా ఉన్న ఆ రెండు పార్టీలను ఎదుర్కొనే విషయంలో బీజేపీపై కొంత సానుకూలంగా ఉండే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు జనసేనతో కలిసి పోటీ చేసేందుకు పాకులాడుతున్నాయి. ఈ రెండు పార్టీలు చివరికి చంద్రబాబు చెంత చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సీపీఎం కొంత స్వతంత్ర ఆలోచనతో వ్యవహరించినా సీపీఐ మాత్రం పవన్, బాబుల్లో ఎవరో ఒకరి పంచన చేరడం మాత్రం ఖాయమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ తాను వచ్చే ఎన్నికలనూ సింగిల్‌గా ఎదుర్కోవడానికే ప్రిపేర్ అయినట్లు స్పష్టమవుతోంది. పొత్తులపై చర్చ వచ్చిన సందర్భాల్లో ఒంటరిగా వెళుతున్నామని ఆయన నాయకులకు చెబుతున్నారు. పొత్తులపై సొంత పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చినా సర్వేల్లో పార్టీకి అనుకూలత ఉందని, ఇలాంటి సమయంలో మరొకరితో కలవాల్సిన పని లేదని ఆయన కుండబద్దలు కొడుతున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కొద్దిగొప్పో ప్రభావం చూపగలిగే పార్టీలన్నీ గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేశాయని అలాంటి పార్టీలు గెలిచాక తమతోనే కలిసి ఉంటాయనే గ్యారంటీ ఉండదనే అభిప్రాయం జగన్ వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లోనూ పూర్తిగా తమకు సహకరిస్తారా? లేక బాబు చేతుల్లోకి వెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయనే అనుమానాలు కూడా ఆయనలో ఉన్నట్లు తెలిసింది. అందుకే పొత్తులపై జగన్ మొదటి నుంచి విముఖత చూపుతున్నారు. స్వభావ రిత్యా కూడా జగన్ వారితో కలిసేందుకు ఇష్టపడడంలేదని చెబుతున్నారు. నష్టపోతే ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధం తప్ప ఎవరి మీదో ఆధారపడడం అనవసరమనే అభిప్రాయం ఆయనలో మొదటి నుంచి ఉంది. ఎన్నికలకు దగ్గరకు వచ్చాక అనూహ్యమైన పరిణామాలు ఏమైనా జరిగితే తప్ప ఇప్పటివరకైతే సింగిల్‌గా వెళ్లేందుకు పార్టీని జగన్ సమాయత్తం చేస్తున్నారు.