పశ్చిమ గోదావరిలో జగన్ ఎత్తులు చిత్తయ్యాయా?

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

 

వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నంతా పశ్చిమ గోదావరి జిల్లా మీదే ఉంది. వచ్చే ఎన్నికల వ్యూహంలో ఆయన  ఈ జిల్లాకు ఇచ్చిన ప్రాముఖ్యం మరొక జిల్లాకు ఇవ్వడు. ఎందుకంటే  2014 పరాభవం నుంచి కోలుకోవాలనుకుంటున్నారు.

ఇలాంటి కీలకమయిన ఆయన పాదయాత్ర  చడీచప్పుడు లేకుండా పూర్తయింది. జనమయితే విపరీతంగా వచ్చారు. పార్టీ నేతలు సంతోషించారు.  అయితే, రోడ్ల మీద కనిపించిన ఈ సందడి రాజకీయాల్లో అదృశ్యమయింది. ఏ పార్టీలో  పెద్ద అలజడి సృష్టించలేకపపోయింది. ఏ పార్దీలోజగన్ యాత్ర తత్తర పుట్టించలేదు.యాత్ర చేసుకుని ఆయన వెళ్లిపోయారు.దానితో అంతా సద్దమణిగింది. దీనితో వైసిపినేతలు కంగుతిన్నారు. టిడిపికి ధైర్యం వచ్చింది.

తెలుగుదేశం పార్టీ హమ్మయ్య అని వూపిరి పీల్చుకుంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి జగన్ పాదయాత్ర సందర్భంగా పెద్ద గా వలసలు మాత్రం కనిపించలేదు. జగన్ యాత్రకు వస్తుందన్న జనం చూసి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని వైసిపి నేతలు భావించినా అలాంటి పరిస్థితి యాత్ర సందర్భంగా కనిపించలేదు. మరొక వైపు చింతలపూడి, పోలవరం నియోజకవర్గంలో పాదయాత్ర జరగ లేదు.

ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్టిలో పెట్టుకుని తమ పార్టికి తిరుగులేదని వైసిపి నేతలు బాగా ప్రచారం చేశారు. ఈ జిల్లా మీద జగన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఎందుకంటే, 2014లో పశ్చిమగోదావరి జిల్లాలో వైసిపికి ఘోర పరాజయం ఎదురయింది.

జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాలను (14 టిడిపి 1 మిత్రపక్షం) టిడిపి గెల్చుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపిది మామూలు విజయం కాదు. అఖండ విజయం ఎందుకంటే, టిడిపికి వైసిపి కంటే 8.12 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. (నేను ఒక మాట చెబితే ఇక్కడి ప్రజలంతా టిడిపికి వోటేశారు అని ఆ మధ్య పిఠాపురం లో మాట్లాడుతూ జనసేన నేత పవన్ కల్యాణ్ పెద్ద జోక్ వేశారు. ఈ సారి ఆయన తమ వోట్లను వెనక్కు తీసుకోండని పిలుపిస్తారేమో). జిల్లాలో 29,21,520 వోట్లుంటే 24,17,337 వోట్లు పోలయ్యాయి. ఇందులో టిడిపికి 12,08,632(49.99) శాతం వోట్లు పోలయ్యాయి. వైసిపి పోలయింది కేవలం 10,12,271(41.87శాతం) మాత్రమే. కాంగ్రెస్ పడింది 29,766 (.123 శాతం) వోట్లుమాత్రమే.

నిజానికి ప్రజాసంకల్పయాత్ర ఉద్దేశం జగన్ పలుకుబడి పెరిగిందని, ఆయనను చూసేందుకు, ఆపైన వోటేసేందుకు జనం విరగబడి వస్తున్నారని నమ్మకం కల్గించడమే.  ఇలాంటి ప్రచారంతో తెలుగుదేశం పార్టీ  నేతలను, గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేయడమే. అయితే, జగన్ పర్యటన ఆయన కొరుకుడు పడని పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన భూకంపం సృష్టించలేకపోయింది. రాష్ట్రంలో ఏర్పడుతున్న కొత్త వాతావరణంలో జగన్ ఉపన్యాసాలు ఇతర పార్టీ నాయకుల్లో, చివరకు వూగిస

 

జనమయితే విపరీతంగా వచ్చారు గాని, నాయకులెవరూ వైసిపిలోకి జంప్ చేయలేదు. ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరూ వైసిపి తొంగిచూడక పోవడం ఆ పార్టీని బాగా నిరుత్సాహ పరిచిందని అంటున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు వైసిపిలో చేరేందుకు తహతహలాడుతున్నారని చెప్పినా, వారెవరో తేలడంలేదు. అంత తహ తహ లాడే నాయకులు ఘనంగా, అట్టహాసంగా సాగుతున్న యాత్రలో వైసిపిలోకి జంప్ చేసేందుకు అడ్డొచ్చిందేమిటి?

చింతలపూడి,పోలవరం నియోజకవర్గాలు తప్ప మిగిలిన 13 నియోజకవర్గాలో నెలరోజుల పాటు జగన్ పాదయాత్ర చేశారు. ముందుముందు భారీగా చేరికలు ఉంటాయని ఇపుడు వైసిపి నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే, అటువైపు నుంచి ఏ ఒక్క నాయకుడిని కోల్పోకుండా ఉండేందుకు తెలుగుదేశం తీసుకున్న చర్యలు విజయవంతమయ్యాయి.

అందరి మీద కన్నేసి ఉంచాలని నియోజకవర్గాలుగా పార్టీ ఎమ్మెల్యేలకు ఆదేశాలువెళ్లాయి. సీనియర్లే కాదు, ద్వితీయ శ్రేణి నాయకులెవరైరా వైసిపి వైపు మొగ్గు చూపుతున్నారా అనేదాని మీద కూడ ఆరా తీశారు. అయితే, సర్ ప్రైజ్ , ఎక్కడ జంప్ చేసే కదలికలు కనిపించలేదు. దీనితో తెలుగుదేశం పార్టీ హమ్మయ్య అని వూపిరి పీల్చుకుంది.

కాపుసీనియర్ నేతలు హరిరామ జోగయ్య, కరాటం రాంబాబు వస్తారని చెప్పి వెనక్కి వెళ్లారని అంటున్నారు. కరాటం రాంబాబు జిల్లాలో పేరున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయన కాంగ్రెస్ లో ఉండదల్చుకోలేదని, అనుకూలమయిన పార్టీ కోసం వెదుకుతున్నారని ,అందువల్ల ఆయన జగన్ యాత్ర సందర్భంగా ఆయన వైసిపిలో చేరతారని అనుకున్నారు.

చిత్రమేమంటే, ఆయన టిడిపిలోకి వస్తారని, ఈ ఉద్దేశంతోనే ఆమధ్య పోగొండ రిజర్వాయర్ పేరుతో ముఖ్యమంత్రి ని కలిశారని చెబుతున్నారు. కాంగ్రెస్ టిడిపి పొత్తు వార్తలొస్తున్నందున ఆయనపునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. ఇకహరిరామజోగయ్య ఎక్కడా ఉన్న ఒక్కటే… ఆయనిపుడు ఏపార్టీలో ఉన్నారో కూడా ప్రజలు కు తెలియదు. ఆయన వైసిపిలోకి వస్తారని అనుకున్నారు. ఆయన డిమాండ్లకు వైసిపి నాయకత్వం అంగీకరించలేదని ఫలితంగా ఆయన కూడా వెనక్కు వెళ్లారని చెబుతున్నారు. టిడిపికి కంచుకోటగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర కలకలం సృష్టించలేకపోయింది. మరి 2019లో 2014 పునరావృతం అవుతుందా లేక జగన్ కంచుకోటలో నిదానంగా  కాలుమోపుతారా చూడాలి.