ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజురోజుకు తలనొప్పిగా మారుతుంది. ఇప్పటికే ఈ రెబల్ ఎంపీ వ్యవహరానికి సంబంధించి పార్టీ నేతలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేశారు. వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం నేరుగా పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ ఒక్క మాట కూడా అనకపోవడంతో ఈ అంశంలో స్పీకర్ కూడా ఏం చేయాలని స్థితిలో ఉన్నారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అది రఘురామకృష్ణంరాజుకే కలిస్తోందని ఆలోచనతో ఆయన ఎంత ‘రెచ్చిపోతున్నా’ పార్టీ నేతలు మాత్రం ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. అయితే ఇప్పటికే ఎంత ఘాటు వ్యాఖ్యలు చేసినా పార్టీ నేతలు తనను సస్పెండ్ చేయడం లేదని గ్రహించిన ఈ రెబల్ ఎంపీ ఇప్పుడు తన విమర్శల స్థాయిని ఇంకాస్త పెంచారు. ప్రతి రోజు ఒక అరగంట పాటు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ అనర్హత వేటు వేయడానికి కుదరని అంశాలపై మాట్లాడుతూ పార్టీ నేతలకు కొరకరాని కొయ్యగా మారారు రఘురామకృష్ణంరాజు.
రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై ఇప్పటికే పార్టీలో పలువురు నేతలు ఆగ్రహాంతో ఊగిపోతున్నట్లు తెలుస్తోంది. ‘ఒక్కమాట చెప్పండి. మిగతాది మేము చేసుకుంటాం’ అని క్రింది స్థాయి కేడర్ ఇప్పటికే సీనియర్ నేతలపై ఒత్తడి చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం పార్టీలో పలువురు సీనియర్ నేతలు ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసినట్లు సమాచారం. ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, ఇలాగే వదిలేస్తే ప్రభుత్వానికే కాకుండా పార్టీకి కూడా పూర్తి స్థాయిలో నష్టం చేకూరుతుందని ఆ నేతలు ముఖ్యమంత్రి ఎదుట వాపోయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ అంశంపై సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటాని చెప్పి పంపించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజు మాత్రం రోజు రోజుకి తన స్వరం పెంచుతున్నారు. ఏం మాట్లాడినా తనను పార్టీ సస్పెండ్ చేయదని తెలుసుకొని ఎలాగైనా వాళ్లను అసహనానికి గురిచేయాలని కాస్త హద్దులు దాటి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత మూడు రోజులుగా ఆయన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతుందంటున్నారు. ‘ఏడు కొండలు ఏడుగురు రెడ్డిలకు మా ముఖ్యమంత్రి కట్టబెట్టారు. ప్రాంతానికో పాలేగాడిని నియమించారు.’ లాంటి వ్యాఖ్యలు కాస్త ఆయన స్థాయిని తగ్గించినట్లు ఉంటున్నాయని అంటున్నారు.
“ఆయన మాట్లాడే మాటాలు వైసీపీ ప్రభుత్వానికి ఎంత నష్టం చేకూర్చుతాయో అదే సమయంలో అదే స్థాయిలో రఘురామకృష్ణం రాజుకి కూడా నష్టాన్ని చేకూర్చుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ నేత ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి తాను ఉన్న పార్టీనో లేదా ప్రభుత్వాన్నో తిడుతూ ఉంటే ప్రజల కూడా దీని వెనుక ఎజెండాను అర్ధం చేసుకోగలగుతారు. కాబట్టి సందర్భాన్ని బట్టి ఆయన బయటికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది కాని ఆయన మాత్రం తనను సస్పెండ్ చేయించుకోవాలనే ఆరాటంలో రోజూ ఇలా వచ్చి వ్యాఖ్యలు చేస్తోన్నారు. అయితే ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏం చేయాలేని స్థితిలోనే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్లు సస్పెండ్ చేయదల్చుకోలేదు కాబట్టి స్పీకర్ నిర్ణయంపైనే ఆశలు పెట్టుకొని ఉన్నారు. అందువలన రఘురామకృష్ణంరాజు ఎన్ని వ్యాఖ్యలు చేసినా భరించాల్సిందే.” అని అనుకుంటున్నారట.