ఏపీ సీఎం వైఎస్ జగన్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలను ప్రజలకు దగ్గర చేయాలని భావించారు. అయితే చాలామంది ఎమ్మెల్యేలకు ఈ కార్యక్రమం యొక్క గొప్పదనం అర్థం కాలేదు. వైసీపీ ఎమ్మెల్యేలలో చాలామంది ఎమ్మెల్యేలు మొక్కుబడిగా జగన్ కు భయపడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారే తప్ప ప్రజలకు దగ్గర కావాలని ప్రయత్నం చేయలేదనే సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్ కు ఉన్న మంచి పేరు వల్లే గెలిచారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో నివశించకుండా నగరాలకు పరిమితమవుతున్నారు. మరి కొందరు వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులను కలగజేస్తూ ఉండటం గమనార్హం.
జగన్ వైసీపీ నేతలను మార్చాల్సిన అవసరం ఉంది. 2019 ఎన్నికల నాటి పరిస్థితులు 2024లో లేవు. జగన్ పరిపాలన గురించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ నేతలు, జనసేన నేతలు చేస్తున్న ప్రచారం వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ల అభిప్రాయాలను సైతం మారుస్తుండటం గమనార్హం. జగన్ 2024 ఎన్నికలకు కూడా టికెట్లను కేటాయించి అభ్యర్థులను ఎంపిక చేసి వాళ్లు నియోజకవర్గాల్లో యాక్టివ్ అయ్యేలా చూడాల్సి ఉంది.
వైసీపీకి అనుకూల పరిస్థితులు లేని నియోజకవర్గాలపై జగన్ మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిన నియోజకవర్గాల్లో పార్టీ ఖచ్చితంగా గెలిచే దిశగా జగన్ అడుగులు వేయాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా అధికారంలోకి రావడానికి జగన్ తన వంతు కష్టపడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అలా చేస్తే మాత్రమే పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు.