బాబు ఆర్థిక మూలం పై జగన్ వ్యూహం !

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి జగన్ లెక్కలను అందుకోవడం హేమాహేమీలకు కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల మెప్పు పొందుతూనే మరో పక్క టీడీపీనీ ఇరుకున పెట్టేందుకు తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నాడు జగన్.

అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా కోలుకోలేని స్థితికి తీసుకొచ్చిన జగన్, ఇక ఆయన ఆర్థిక మూలాలను కూడా దెబ్బకొట్టేందుకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తుంది. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో బాబు గారికి మంచి ఆదాయ వనరుగా ఉన్న హెరిటేజ్ కంపెనీ చతికిలపడడం ఖాయంగా అనిపిస్తుంది. ఒకప్పుడు హెరిటేజ్ కంపెనీ వ్యవహారాలు లోకేశ్ చూసుకున్నా ఇప్పుడు ఆయన రాజకీయాలకు పరిమితం కావడంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు చూసుకుంటున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్న హెరిటేజ్ కంపెనీ పాలవ్యాపారంలో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది నారా వారి కుటుంబానికి.

ఇప్పుడు దానిని దెబ్బకొట్టేందుకు దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పతుల సంస్థగా ఉన్న అమూల్ డైరీతో రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం జగన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ప్రభుత్వం తరపున పాడిరైతులకు మరింతగా ప్రోత్సాహాకాలు ఇచ్చి వారిని అమూల్ సంస్థ వైపు ఆకర్షించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీలో అమూల్ సంస్థ కనుక నిలదొక్కుకుంటే బాబుగారి హెరిటేజ్ కంపెనీకి తీవ్రనష్టం వాటిల్లే అవకాశమున్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే బాబుగారి ఆర్థిక మూలానికి కొంత మేర గండీ పడినట్టే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.