వైఎస్ జగన్ పాలిస్తున్న తీరు ఒకింత భిన్నంగానే ఉంది. పాలకులు ఎవరైనా సరే ఒక కన్ను సంక్షేమం మీద పెడితే ఇంకో కన్ను అభివృధ్ది మీద పెట్టాలి. అప్పుడు రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది. వీటిలో ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా ఒకవైపు మునుగుతూ ఇంకోవైపు పైకిలేస్తున్న ఓడలా తయారవుతుంది. సరిగ్గా ఇదే జరుగుతోందని అంటున్నారు ఏపీలో. జగన్ పీఠం మీద కూర్చున్న మరుక్షణమే సంక్షేమ పథకాల బాటపట్టారు. ఎన్నికల ముందు మాటిచ్చిన నవరత్నాల్లో భాగంగా భారీ స్థాయిలో నగదు బదిలీకి పూనుకున్నారు. వేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. అమ్మఒడి, ఆసరా, బీసీ రుణాలు,చేయూత, పింఛన్ల పెంపు, రైతు భరోసా అంటూ స్థోమతకు మించి ఖర్చు చేస్తున్నారు. దాంతో అసలే ఖాళీగా ఉన్న ఖజానా మీదా అప్పుల భారం పడుతోంది. ఖజానా మీద భారమంటే ప్రజలు మీద భారమన్నట్టే లెక్క. ఖజానా నుండి తీసి కట్టాల్సిన ప్రతి రూపాయీ ప్రజల జేబుల నుండి రావాల్సిందే.
అయినా జగన్ వెనుకాడట్లేదు. వీలున్న ప్రతిచోటా అప్పులు తెచ్చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న మేధావులు, విశ్లేషకులు అప్పులు తెచ్చి సంక్షేమం ఏమిటని అడుగుతున్నారు. ఇలాగే అప్పులు చేస్తూ పోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరే ఇప్పటి అప్పులకు ఎదురుకాబోయే కష్టాలను తట్టుకోవడానికి అభివృద్ధితో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవైనా చేస్తున్నారా అంటే లేదు. సంక్షేమం నాలుగు పాదాలతో నడుస్తుంటే అభివృద్ధి ఒక్క పాదం మీద నడవట్లేదు. ఒక్క పోలవరం మినహా రాష్ట్రంలో జరుగుతున్న చెప్పుకోదగిన ప్రాజెక్టులు ఏవీ లేవు. గత ప్రభుత్వం మొదలుపెట్టో లేకపోతే శంఖుస్థాపన చేసిన పనులే ఇప్పటికీ తిరిగి మొదలుకాలేదు. ఇక కొత్త ప్రాజెక్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
మరి ఈ పొరపాటును ప్రభుత్వానికి, సలహాదారులు తెలుయడంలేదా అంటే తెలియదని ఎలా అనుకోవాలి. కానీ కొత్తగా వినిపిస్తున్న వాదన మేరకు ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని, దీని వెనుక పెద్ద తల వేరే ఉందనే అనుమానం కలుగుతోంది. ఆ తలా మరెవరో కాదు ప్రధాని మోదీనే అంటున్నారు. మోదీ మనసులో ప్రస్తుతం ఉన్న ఏకైన కోరిక ఒకే దేశం – ఒకే ఎన్నిక. ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గం జమిలి ఎన్నికలు. పలు రాష్ట్రాల పదవీ కాలాలను కుదించి అయినా సరే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ భావిస్తున్నారు. బీజేపీ పాలిట రాష్ట్రమే కాదు బీజేపీ యేతర ప్రభుత్వాలునం రాహ్స్త్రాలు సైతం ఎన్నికలు ఖాయమనే ఉదేశ్యంలోనే ఉన్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు అభ్యంతరాలు తెలిపినా అవి ఆగేలా లేవు. స్వయంగా ఎలక్షన్ కమీషన్ చీఫ్ మాట్లాడుతూ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి రెడీగా ఉన్నామని అన్నారంటే అంతర్గతంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని అర్థమవుతోంది.
ఈ ఎన్నికలే జగన్ పాలన్ మీద పెను ప్రభావాన్ని చూపుతున్నాయట. జమిలి ఎన్నికలు వస్తాయనే సమాచారం పదవి చేపట్టినప్పుడే ఆయనకు తెలుసని అంటున్నారు. రాజ్యాంగం మేరకు 2019లో సిఎం అయిన జగన్ 2024 వరకు పదవిలో ఉండాలి. కానీ జమిలి ఎన్నికలు వస్తే 2022 వరకే పదవీ కాలం ఉంటుంది. అంటే జగన్ పాలించేది మూడేళ్లు లేదా ఆపైన ఇంకొన్ని నెలలు మాత్రమే. ఈ మూడేళ్ళ కాలంలో అభివృద్ధి అంటూ కూర్చుంటే జనంలోకి వెళ్ళలేరు. ఎన్నికలు వచ్చేనాటికి ఏం చేశారని జనం అడిగితే మొదలుపెట్టి ఆరంభ దశలోనో శరవేగంగా చేశారు అంటే మధ్య దశలోనే ఉన్న ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను చూపెట్టాలి. అవెలాగో జనానికి పట్టవు. వారికి కావాల్సిందల్లా మీ హయాంలో మాకు జరిగిన మంచి ఏమిటి, మేము పొందిన ప్రయోజనాలు ఏంటనేదే. అందుకే జగన్ జమిలి ఎన్నికల నాటికి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, వారి అభిమానాన్ని పొందాలని, ప్రతిపక్షానికి ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే సంక్షేమ పథకాలను విపరీతంగా అమలుచేసున్నారు.
ఆయన ప్లాన్ కరెక్టుగానే అమలవుతోందట. జనంలో జగన్ పేరు మోగిపోతోంది. నభూతో అనే రీతిలో జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, భారీగా లబ్ది చేకూరుతోందని మహిళలు కొనియాడుతున్నారు. ఈ ఊపులోనే గనుక ఎన్నికలకు వెళితే మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనబడుతోంది. అసలు ఈ జమిలి సంగతి ముందే జగన్ కు ఎలా తెలుసు అంటే అది మోదీ బృందం నుండి అందిన సమాచారమేనని, అందుకే జగన్ కు మోదీ అంటే అంతటి గౌరవమనే వాదనలు కూడ వినిపిస్తున్నాయి. అసలు అన్ని పార్టీలు జమిలి జమిలి అంటూ హడావిడి చేస్తుంటే జగన్ మాత్రం మౌనంగా ఉండటానికి కారణం కూడ ఇదేనని అంటున్నారు.