పాదయాత్ర తర్వాత జగన్ మరో ఎత్తుగడ

రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఏపీలో అన్ని పార్టీల నేతలు వ్యూహ రచనలు చేస్తున్నారు. జోరుగా ప్రచారాలు మొదలెట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ని ఓడించి ఎలాగైనా సీఎం పీఠాన్ని అధిష్టాంచాలని జగన్ దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. అందులో భాగంగా పాదయాత్ర చేస్తూ ఇప్పటికి 3100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు.

నవంబర్ లో పాదయాత్ర ముగింపు దశకు చేరుకోనుంది. కానీ తెలంగాణ ముందస్తు ఎన్నికలు జరుగుతుండడటంతో ఆ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఆంధ్రాలో కూడా చూపిస్తుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ పాదయాత్రను డిసెంబరు చివరి వారం వరకు పొడిగించే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.

పాదయాత్ర చేపట్టినప్పుడు వెలువడిన షెడ్యూల్ ప్రకారం 307 రోజులు, 3,500 కిలో మీటర్లు 125 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర సాగాల్సి ఉంది. ఇప్పటికి ఆయన 116 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 3,100 కిలోమీటర్ల పాదయాత్రను కంప్లీట్ చేశారు. ఈ లెక్క ప్రకారం పాదయాత్ర నవంబర్ 5 వరకు ముగింపు దశకు చేరుకోవాల్సి ఉంది. కాగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ పాదయాత్రను మరికొన్ని రోజులు పొడిగించాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరి పాదయాత్ర ముగిశాక జగన్ ఏం చేయనున్నారు? అనేది అందరిలో మెదులుతున్న సందేహం. కాగా ఆయన పాదయాత్ర ముగిశాక పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారట. అంతే కాదు టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోగాజకవర్గాల్లో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి నవరత్నాల పధకం గురించి ప్రజల్లోకి లోతుగా వెళ్లేలా ప్రచారం చేయాలి అని భావిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

అంతేకాదు జగన్ బస్సు యాత్ర కూడా చేపట్టనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. బస్సు యాత్ర చేసినా, చేయకపోయినా పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి పార్టీని మరింత చేరువ చేయాలనే ఆలోచనలో ఉన్నారు జగన్.