బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ ఏపీ : తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్ధిని మార్చబోతోన్న జగన్ ?

cm jagan mohan reddy n

తిరుపతి లోక్ సభ కు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఫిబ్రవరి మధ్యలో వచ్చే అవకాశం ఉంది. మార్చి 15 నాటికి ఎన్నిక జరిగిపోవాలి. కొత్త ఎంపీ రావాలి. నిబంధనలు చెబుతున్నది ఇదే. దాంతో నెల రోజుల ముందుగా నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఈ నేపధ్యంలో అందరి దృష్టి తిరుపతి ఉప ఎన్నిక మీద ఉంది. ఇక ఏపీలోని రాజకీయ పార్టీలు అయితే తిరుపతి మీద ఒక కన్నేసి ఉంచాయి. తిరుపతి సీటును గెలుచుకుని సత్తా చాటాలన్న ఉబలాటంలో టీడీపీ ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో ఉనికి చాటుకోవాలనుకుంటోంది.

ap cm jagan
ap cm jagan

మరి అధికార వైసీపీలో పరిస్థితి ఏంటి అన్నదే ఆసక్తికరమైన చర్చ. తిరుపతి వైసీపీకి అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తి పేరుని అనధికారికంగా పార్టీ ఖరారు చేసింది. జగన్ ఆయనకు మాట ఇచ్చేశారు, కీలక నేతలకు కూడా ఈ సంగతి చెప్పేశారు అంటున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఏడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నిక ఉంటుంది. పైగా అసలు ఎన్నికల కంటే ఈ కొసరు ఎన్నికలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అన్నది తెలిసిందే.

ప్రతిష్టతో కూడుకున్న ఉప ఎన్నిక కావడంతో ఖర్చుకు ఆకాశమే హద్దు అంటున్నారు. మరి ఆర్ధికంగా చూస్తే గురుమూర్తికి అంత స్తోమత లేదని పార్టీ వర్గాల సమాచారం. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే కాదు, అభ్యర్ధికి సంబంధించిన ఆర్ధిక భారాన్ని కూడా జిల్లాకు చెందిన నేతలు, పెద్దలు, మంత్రులు భరించాలన్నదే పార్టీ విధానంగా ఉందిట. అలా అయితే కచ్చితంగా వంద కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గానికి పది నుంచి పదిహేను కోట్లు వేసుకున్నా వంద కోట్లు పట్టుకుంటేనే తప్ప ప్రత్యర్ధులను తట్టుకుని ధాటీగా ప్రచారం చేయలేమని నేతలు అంటున్నారు.

అయితే తాము ప్రచారం ఎంతైనా చేస్తాం కానీ ఖర్చు మాత్రం ఆ రేంజిలో భరించడం అంటే వల్ల కాదని పలువులు సీనియర్లు చేతులెత్తేస్తున్నారుట. అయితే తిరుపతి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే జగన్ అందరికీ కూర్చోబెట్టి బాధ్యతలతో పాటు ఖర్చుల భారాన్ని కూడా తలా ఇంతా పంచుతారని అంటున్నారు. అయితే వైసీపీలో ఇపుడు మరో మాట కూడా వినిపిస్తోంది. డబ్బు ఖర్చుకు వెనకాడని వారు కొంతమంది పోటీకి రెడీ అంటున్నారుట. వారిలో ఒకరిని తెచ్చి ఎంపిక చేస్తే తమకు ఈ ఆర్ధిక భారం తప్పుతుంది కదా అని వారి సూచనట. ఆ విధంగా వంద కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి ఒక మాజీ ఎంపీ గారు కూడా రెడీ అంటున్నారుట. మరి జగన్ మనసు గురుమూర్తి మీదనే ఉంది. దాంతోనే అటు నాయకుడికి చెప్పలేక ఇటు భారం మోయలేక వైసీపీ నేతలు పరేషాన్ అవుతున్నారుట.