చంద్రబాబు స్కిల్… జగన్ కి అంత ధమ్ము లేదు!

గతకొన్ని రోజులుగా ఏపీలోని అధికారపార్టీ సభ్యులు స్కిల్ డెవలప్‌ మెంట్‌ ముసుగులో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని గోల గోల చేస్తున్నారు. ఇక అసెంబ్లీలో ఏపీ సీఎం అయితే.. ఈ స్కాం గురించి, ఆ స్కాంలో బాబు చూపించిన స్కిల్స్ గురించి కథలు కథలుగా చెబుతున్నారు. అయితే… వీటిని జనం విశ్వసించడం లేదని తెలుస్తుంది! ఎందుకంటే… చంద్రబాబు & కో లపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిన అవినీతి ఆరోపణలనీ.. ఆరోపణలుగానే మిగిలిపోయాయి.. ఏ ఒక్కటీ పూర్తి విచారణకు నోచుకుందీ లేదు.. నేరస్థులకు శిక్ష పడిందీ లేదు! ఫలితంగా… ఇవన్నీ జనాల దృష్టిలో టీవీల్లో కామెడీ షోలుగా మారిపోతున్నాయి!

“స్కిల్ స్కాం సూత్రధారి చంద్రబాబే.. విద్యార్థుల‌ పేరుతో దేశంలో జరిగిన అతి పెద్ద స్కాం ఇది.. షెల్ కంపెనీలకు ప్రభుత్వ సొమ్ము జమైంది.. దోపిడీ సొమ్మంతా మళ్ళీ చంద్రబాబు దగ్గరకే చేరింది.. కీలక వ్యక్తులు బయటకు రాక తప్పదు.. స్కిల్ డెవలప్మెంట్ పేరిట ఏపీలో భారీ స్కాం కి బాబు తెర తీశారు.. ఈ మొత్తం కుంభకోణంలో ఆయనే మొదటి ముద్దాయి” ఇది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు. అంతాబాగానే ఉంది కానీ ఆరోపణలను ఆరోపణల వరకే పరిమితం చేస్తారా? లేకపోతే తిరుగులేని ఆధారాలతో నిరూపించేదేమైనా ఉందా? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయంగా మారిన అంశం ఇది!

ఎన్నికల ప్రచారంలో… అధికారంలోకి రాగానే చంద్రబాబు అవినీతి బయటపెట్టి నిరూపిస్తామని ప్రజలకు ప్రామిస్ చేసిన జగన్… ఆ దిశగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబుపై జగన్ అండ్ కో చాలా అవినీతి ఆరోపణలు మాత్రం చేశారు. అమరావతి భూములకు సంబంధించి ఇన్ సైడర్ ట్రేడింగ్‌ జరిగిందని – ఫైబర్ గ్రిడ్‌ లో వేలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని – తాత్కాలిక భవనాల పేరుతో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణంలో చంద్రబాబు వందల కోట్లు తినేశారని – రాజధాని నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలను డిజైన్ల పేరుతో దుర్వినియోగం చేశారనీ… ఊకదంపుడు ఉపన్యాసాలతో ఇలాంటి ఆరోపణలు చాలానే చేశారు. కానీ, ఏ ఒక్కదాన్ని జగన్ సర్కార్ నిరూపించలేకపోయింది.

కక్షసాధింపు చర్యల్లో భాగంగానో, లేక మరో కారణంతోనో ఇలా రకరకాల ఆరోపణలపై బాబుపై పెట్టిన కేసులు ప్రస్తుతం కోర్టుల్లో మగ్గుతున్నాయి. వాటిలో ఒక్కదానిలోనూ విచారణ ముందుకు సాగటంలేదు. ఆ విషయంలో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతున్నట్లుగా ఉంది! ఇవన్నీ ఇలా ఉండగానే తాజాగా స్కిల్ డెవలప్‌ మెంట్‌ ముసుగులో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని గోల మొదలుపెట్టారు జగన్ & కో. దీంతో… “నిరూపించే ధమ్ము లేనప్పుడు, ఆరోపణలు చేసే అర్హత కూడా ఉండదు” అనే కామెంట్లు ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి. బట్టకాల్చి ముఖంమీద వేసే చర్యలవల్ల ఒరిగేదేమీ లేదని, బురదజల్లేసి తర్వాత కడుక్కోమంటే కుదరదని జగన్ కు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు తమ్ముళ్లు! ఇలాంటి ఆరోపణలు ఎన్ని చేసినా చంద్రబాబుకు వచ్చే నష్టమేమీలేదని.. బాబు అవినీతిపరుడని ఆధారాలతో కోర్టులో నిరూపించే ధమ్ము జగన్ కు ఈ జన్మలో లేదని, ఈ జన్మకు రాదని తేల్చి చెబుతున్నారు.

మరి టీడీపీ కార్యకర్తలు, నాయకులూ ఈ రేంజ్ లో జగన్ చేతకానితనం గురించి చెబుతున్నప్పుడు… ఆ అసమర్ధతను నిరూపించుకునే పని జగన్ చేస్తారా? ఆ మచ్చను తుడిచేసుకునే పనికి పూనుకుంటారా? బాబు అవినీతిని నిరూపించ గలరా?… లేక, తనకు అంత చేవలేదని సైలంట్ అయిపోయి, కేవలం ఆరోపణలకే పరిమితమవుతారా? అన్నది వేచి చూడాలి!