ఆ ఇళ్ళే జగన్ సర్కారుకి షాక్ ఇవ్వబోతున్నాయా.?

చాలా లే-ఔట్లు నీట మునిగిపోయాయ్.. వర్షా కాలం గనుక.. ఈ సమస్య తప్పదేమో. ప్రభుత్వమే ఇళ్ళు కట్టించుకునేలా, అబ్దిదారులు తమకు నచ్చినట్టు ఇళ్ళు నిర్మించుకుంటే, అవసరమైన సామాగ్రి అందించేలా.. ఇలా పలు ఆప్షన్లను జగన్ సర్కార్, పేదల ఇళ్ళ కోసం ప్రతిపాదించిన విషయం విదితమే. నిజానికి, దేశంలో ఏ రాష్ట్రమూ చేపట్టని బృహత్ కార్యక్రమమిది. సంక్షేమ పథకాల చరిత్రలోనే ఇదో గొప్ప పథకం. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళతో దీన్ని ఎంతవరకు పోల్చగలం.? అన్నది వేరే చర్చ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఇంతకు ముందెన్నడూ చూడనంత గొప్ప కార్యక్రమం.. అనే చర్చ జరుగుతోంది.

కానీ, ప్రభుత్వం చెబుతున్న ధరకి ఇళ్ళ నిర్మాణం సాధ్యమేనా.? లక్షా ఎనభై వేలు పట్టుకుని ఇంటిని నిర్మించుకోవడం సామాన్యులకు జరిగే పనేనా.? అధికారులేమో, కొన్ని ఇళ్ళను మాత్రమే ప్రభుత్వం నిర్మించేలా, మిగతా వాటిని లబ్దిదారులు నిర్మించుకుంటే ఆర్థిక సాయం అందించేలా ప్లాన్ చేయడం వివాదాస్పదమవుతోంది. అసలే, ఊరికి దూరంగా ఇళ్ళ స్థలాలిచ్చారన్న విమర్శ వుంది. ఇంకోపక్క ముంపు ప్రాంతాల్లో ప్లాట్లు వేశారన్న విమర్శ వుంది. ఇప్పుడేమో కొత్తగా ఈ తంటా వచ్చి పడింది. ఈ వ్యవహారమిప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ళను పేదలకు సకాలంలో అందకపోతే, రాజకీయంగా అధికార పార్టీకి అది చాలా పెద్ద దెబ్బ అవుతుందన్నది నిర్వివాదాంశం. ఇంతవరకు ఈ వ్యవహారంపై అధికార పార్టీ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల నుంచి సమస్యలున్నయా.? లేదంటే నిధుల కొరత వుందా.? లబ్దిదారుల సమస్యలేంటి.? అన్నదానిపై ప్రభుత్వ పెద్దలు దృష్టిపెట్టకపోతే మాత్రం.. ఇదో అతి పెద్ద ఫ్లాప్ ప్రోగ్రామ్ అనే ముద్ర పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విపక్షాలు అవకాశం కోసం ఎదురుచూస్తున్న దరిమిలా, ప్రభుత్వం ముందే మేల్కొంటుందేమో చూడాలిక.