తాడేపల్లి : సీఎం క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ, జగనన్న తోడు పథకం, ఉపాధి హామీ పనులు, నాడు- నేడు, కోవిడ్-19 నివారణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.కోర్టు స్టే ఉన్నచోట్ల మినహా, మిగిలిన ప్రాంతాల్లో డిసెంబరు 25న డి-ఫామ్ పట్టాలతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెడతామని పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకుంటే అర్హులకూ 90 రోజుల్లో అవకాశం ఇస్తామన్నామని, ఈ మేరకు 1.20 లక్షల మందిని కొత్తగా జాబితాలో చేర్చినట్లు వెల్లడించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ… ‘‘తొలుత మార్చి 25న ఉగాది రోజు ఇవ్వాలనుకున్నాం. ఆ తర్వాత ఏప్రిల్ 14, అంబేడ్కర్ జయంతి రోజున, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న, దివంగత నేత వైయస్సార్ జయంతి రోజు అయిన జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, చివరగా అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్నీ వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష కుటిల రాజకీయాల వల్ల పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయపోరాటం చేయాల్సి వస్తోంది’’అని పేర్కొన్నారు. ‘‘గతంలో పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పేదలకు ఇప్పుడు సెంటు, సెంటున్నర స్ధలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారు. ఈ యుద్ధంలో గెలుస్తాం. దేవుడు మనకు అండగా ఉంటాడు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించాం. వాటి మార్కెట్ విలువ రూ.23 వేల కోట్లు. మొత్తం 30,68,821 మంది పేదలకు పంచబోతున్నాం’’అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.