జగన్ కు రిలీఫ్ ఇచ్చిన టిడిపి నేత రాజీనామా

జగన్మోహన్ రెడ్డికి పెద్ద రిలీఫ్ వచ్చింది. తెలుగుదేశంపార్టీ హయాంలో మహిళా కమీషన్ ఛైర పర్సన్ గా నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయటంతో అదే పోస్టును వైసిపి అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మకు ఇవ్వనున్నట్లు సమాచారం. టిడిపి హయాంలో నియమితులైన  కొందరు నేతలు ఇంకా తమ పదవులను పట్టుకుని ఊగుతునే ఉన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం మారినా ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయటానికి రాజకుమారికి మనసు రాలేదు. తననే ఛైర్ పర్సన్ పదవిలో కొనసాగించాల్సిందిగా కోరారు.  నిజానికి ప్రభుత్వం మారగానే ఛైర్మన్లు చేయాల్సిన పని వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయటం. లేకపోతే ప్రభుత్వమే అందరినీ పీకేస్తుంది.

పదవుల్లోనుండి తమను పీకేంత వరకూ పట్టుకుని వేలాడటం నేతలకు మంచిది కాదు. అలాగని వాళ్ళని సాగనంపేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయటమూ గౌరవం కాదు. అందుకే ప్రభుత్వం మారగానే వెంటనే రాజీనామాలు చేసేస్తే అందరికీ గౌరవమే కాకుండా నైతికంగా కూడా బాగుంటుంది.

కానీ కొందరు మాత్రం రాజీనామాలు చేయకుండా కంటిన్యు అవ్వటమే కాకుండా నన్నపనేని లాగ తమనే కంటిన్యు చేయమని అడగటమేంటో ఎవరికీ అర్ధం కాలేదు. మరి తెరవెనుక ఏమి జరిగిందో కానీ తన రాజీనామాను  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు రాజకుమారి అందించటమే విచిత్రంగా ఉంది. పైగా రాజీనామా విషయమై మట్లాడుతూ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినట్లు చెప్పటమే విచిత్రం. ప్రభుత్వం మారిన రెండు నెలలకు రాజకుమారికి నైతిక బాధ్యత గుర్తుకు వచ్చింది.