ఇక్బాల్ కు జాక్ పాట్..ఎంఎల్సీ హామీ

వైసిపి నేత మొహ్మద్ ఇక్బాల్ కు జాక్ పాట్ తగిలింది. అదికూడా రంజాన్ మాసం లో ఇఫ్తార్ విందు సందర్భంగానే కావటం గమనార్హం. హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణపై పోటీ చేసిన ఇక్బాల్ ఓడిపోయిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి గుంటూరులో జగన్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆ సందర్భంగా  ఇక్బాల్ కు జగన్మోహన్ రెడ్డి ఎంఎల్సీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

జగన్ ప్రకటన విన్న ముస్లిం నేతలు ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటగా ప్రకటించిన పోస్టు ముస్లింలకే అవటంతో అందరూ తెగ ఆనందపడిపోయారు. ముస్లిం సోదరులకు తగిన ప్రాధాన్యత ఇస్తానని ఎన్నికలకు ముందు జగన్ ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని జగన్ నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇక్బాల్ హిందుపురంలో పోటీ చేయకముందే రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన అబ్దుల్ ఘనీని టిడిపిలో నుండి వైసిపిలోకి చేర్చుకున్నారు. ఎంఎల్ఏ టికెట్ హామీతోనే వైసిపిలోకి తీసుకున్నారు. అయితే చివరి నిముషంలో ఇక్బాల్ కు టికెట్ కేటాయించారు. స్ధానికుడు, మాజీ ఎంఎల్ఏ అయిన ఘనీని కాదని ఇక్బాల్ కు టికెట్ ఇచ్చినా అందరూ కష్టపడి పనిచేశారు. అయినా ఇక్బాల్ ఓడిపోయారు.

అలాంటిది ఆ ఇచ్చే ఎంఎల్సీ పదవేదో అబ్దుల్ ఘనీకో లేకపోతే చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నేత అబ్దుల్ రెహ్మాన్ లాంటి వాళ్ళకో ఇచ్చుంటే బాగుండేది.  ఎన్నికల్లో టికెట్లూ ఇక్బాల్ కే ఇచ్చి ఓడిపోయారని చెప్పి నామినేటెడ్ పదవైన ఎంఎల్సీ కూడా మళ్ళీ ఇక్బాల్ కే ఇస్తే మరి మిగిలిన మైనారిటీ నేతలు ఏమైపోవాలి ?  ఈ విషయంలో జగన్ కాస్త ఆలోచించాలి.