వైసిపి నుంచి టిడిపికి ఫిరాయించిన కర్నూలు లోక్ సభ సభ్యురాలు బుట్టా రేణుక పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. సిటింగ్ ఎంపి అయినా 2109 లోక్ సభ ఎన్నికల్లో ఆమెకు ఎలాంటి పాత్ర లేకుండా పోయింది.
ఆమెకు వస్తుందనుకున్న కర్నూల్ లోక్ సభ సీటును కాంగ్రెస్ నుంచి వచ్చి టిడిపిలో చేరిన కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి తన్నుకుపోయారు.
ఇక వైసిపి కర్నూలు సీటును ఆమెకు అత్యంత సన్నిహితుడిగా ఉండిన డాక్టర్ సింగరి సంజీవ్ కమార్ కు దాదాపు ఖరారుచేసింది.
ఇక ఆమెకు మిగిలింది కేవలం ఎవరికో ఒకరికి ప్రచారం చేసి కాలం, డబ్బు తగలేసుకోవడమే. దానికి ఊరికే ప్రచారం చేస్తానంటే ఏ పార్టీ ఒప్పుకోదు. ఎన్నికలకు చందాలడుగుతారు. ఆమెది ఆర్థికంగా బాగా బలమయిన కుటుంబం అయినందున (కనీసం ఆ ప్రచారం ఉంది) డబ్బు అశిస్తారు.
ఈ నేపథ్యంలో వైసిపి తరఫున గెల్చి టిడిపిలోకి మారి తప్పుచేశానని ఆమె పశ్చాత్తాప పడుతున్నట్లు చెబుతున్నారు. వైసిపి నేత జగన్ కు ఆమె మీద పీకల దాకా కోపం ఉంది.ఆమె పేరెత్తితే చాలు భగ్గున మండుతున్నారట. అందుకే ఆమె కులానికే ( చేనేత) చెందిన పేరున్న డాక్టర్ ను జగన్ వెదికి వెదికి పట్టుకున్నారు.
డాక్టర్ సంజీవ్ ను అభ్యర్థిగా ఆయన దాదాపు ఎంపిక చేశారు. ఆయన పార్టీలో చేరారో లేదో ఏకంగా మ్యానిఫెస్టో కమిటీలో కూడా సభ్యుడిగా నియమించారు.
అన్నింటికంటే ముఖ్యంగా 2014 ఎన్నికల్లో డాక్టర్ సంజీవ్ బుట్టా రేణుక విజయానికి బాగా కృషి చేశారు. డాకర్ట సంజీవ్ బుట్టు కుటుంబానికి బాగా సన్నిహితులు కూడా. జగన్ ఇపుడు ఆయనను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసి క్యాంపెయిన్ మొదలుపెట్టమని చెప్పారట. జగనే కాదు, పార్టీ సినీయర్లు ఆయనతో చర్చలు కూడా జరిపారు.
అందుకే ఇపుడామెకు ఏమిచేయాలో పాలుపోవడం లేదు. టిడిపిలో పెద్దగా గుర్తింపు రాలేదు. వైసిపిలోకి వెనక్కు వెళ్లి చేయాలో ఏమిచేయాలో తెలియదు. మరొక పార్టీలో చేరాలంటే, ఎన్నికల కోసం భారీగా చందాలడుగుతారు. నిజానికి ఆమెను భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సంప్రదించాయి. పార్టీలోకి స్వాగతం పలికాయి. ఆ పార్టీలలో చేరేందుకు ఆమె అంతసుముఖంగా లేరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. జనసేన నుంచి స్వయంగా నాదెండ్ల మనోహర్ నిన్ననే ఆమెకు ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెకు వెళ్లడం ఇష్టం లేదు.
అందుకే తెలుగుదేశంలోనే ఉంటూ రాజ్యసభ సీటో, కౌన్సిల్ సీటో అడిగితే ఎలా ఉంటుందని ఆమె యోచిస్తున్నారు. అయితే, ఈ సమయంలో ఇలాంటి బేరాసారాలు బెడితే వ్యవహారం బెడిసికట్టే ప్రమాదం ఉంది. ఇపుడు ఏదో ఒక హామీ తీసుకొనకపోతే, ముందు ముందు చంద్రబాబు తనని పట్టించుకొనకపోవచ్చు. పోనీ కొంచెం కష్టమయినా వైసిపిలోకి వెళితే ఎలా ఉంటుంది? అని కూడా ఆమె ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
నిజానికి వైసిపిలోకి వెళ్లడమే ఆమెకు గౌరవ ప్రదంగా ఉంటుంది. ఎందుకంటే, గత ఎన్నికల్లో తనకోసం కృషి చేసిన డాక్టర్ సింగరి సంజీవ్ కు తను సాయం చేయవచ్చు. భవిష్యత్తులో ఆయన తనకు అండగా ఉండవచ్చు. ఆయన తల్చుకుంటే జగన్ కు నచ్చ చెప్పి, తన మీద కోపం తగ్గించి పార్టీలోకి ఆహ్వానించేలా చేయవచ్చు. అందుకే ఆమె డాక్టర్ సంజీవ్ ద్వారా వైసిపిలోకి మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని వైపిపి వర్గాల్లో వినబడుతూ ఉంది. అయితే, ఇపుడు జగన్ విషాదంలో ఉన్నారు.బాబాయ్ హత్య నుంచి కోలుకున్నాక ఆయన స్పందన తెలుస్తుంది. జగన్ నుంచి మంచివార్త వస్తుందని ఆమె ఆశిస్తున్నారని సన్నిహితుల ద్వారా తెలిసింది.