వైఎస్ షర్మిలకి వైఎస్సార్సీపీ సహకరిస్తోందా.? లేదా.?

‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మాకేంటి సంబంధం.?’ అని వైఎస్ విజయమ్మ తేల్చేశారు. అంతలోనే, ‘షర్మిల కోసం జగన్, జగన్ కోసం షర్మిల.. ఒకరికొకరు అండగా వుంటారు’ అని కూడా విజయమ్మే చెప్పారు. రెండు సందర్భాలు వేరు.. కానీ, విషయమైతే ఒకటే.

విజయమ్మ వ్యాఖ్యల్లో ఆంతర్యం గురించి పెద్దగా చర్చ అనవసరం. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల వేరు కాదు. రెండు రాష్ట్రాల్లో ఇద్దరూ విడివిడిగా రాజకీయాలు చేస్తున్నప్పుడు, ‘మాకు సంబంధం లేదు’ అని ఒకరి గురించి ఇంకొకరు మాట్లాడటాన్ని వింతగా చూడాల్సిన పనిలేదు. ఇదే రాజకీయమంటే. రాజకీయాల్లో ఇలాగే వుండాలి.

తెలంగాణలో వైఎస్సార్టీపీకి వైఎస్సార్సీపీ నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్నాయి. పేర్లలో ‘సీ’కి బదులు ‘టీ’ వుంది. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అక్కడా, ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరే ప్రధాన ఎజెండా. అక్కడా రాజన్న రాజ్యమే ఎజెండా.. ఇక్కడా రాజన్న రాజ్యమే ఎజెండా.

జగన్ కోసం షర్మిల గతంలో పాదయాత్ర చేశారు. ఇప్పుడు షర్మిల తనంతట తానుగా పాదయాత్ర చేస్తున్నారు.. ఆ పాదయాత్రకి వైఎస్సార్సీపీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోంది.. కానీ, సంబంధం లేనట్టు వ్యవహరిస్తోందంతే.

వైసీపీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా షర్మిలకు సహకరించడం చూస్తోంటే, వైఎస్సార్సీపీకి తెలంగాణ విభాగమే ఈ వైఎస్సార్టీపీ అని చెప్పడంలో సందేహమేముంది.? పైగా, వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించిన ఐ-ప్యాక్ టీమ్, షర్మిలకీ ఆ పని చేసి పెడుతోంది. ‘ఆయనతో నాకేంటి సంబంధం.?’ అని షర్మిల, తన సోదరుడు జగన్ గురించి తాజాగా వ్యాఖ్యానించినా, జరుగుతున్నదేంటో అర్థమవుతూనే వుంది. వైఎస్ జగన్‌ని షర్మిల కాదనుకుంటే.. తెలంగాణలో ఆ కొన్ని ఓట్లూ ఆమెకు వచ్చే అవకాశమే లేదు.