పవన్ విషయంలో జగన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా ?

కాస్త బ్యాలన్సుడుగా మాట్లాడుతాడనుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా మాట తూలుతున్నాడు. అదికూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాల్లో. పాదయాత్రలో భాగంగా శ్రీకాకులం జిల్లాలోని రాజాంలో జరిగిన  సభలో జగన్ మాట్లాడుతూ పదే పదే పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. పవన్ కు నలుగురు భార్యలని, ఎప్పటికప్పుడు భార్యలను మార్చేస్తుంటారని అసందర్భ వ్యాఖ్యలు చేశారు. సిద్దాంత పరంగా ప్రత్యర్ధులను ఎంతైనా విమర్శించవచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ వ్యక్తిగత విషయాలు అందునా ఆడవాళ్ళను వీధుల్లోకి లాగటం అంత బాగోదు. అన్నీ తెలిసిన జగన్ కూడా పవన్ భార్యల గురించి మాట్లాడి తప్పు చేశారు.

 

గతంలో తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినందుకే జగన్ విమర్శలపాలయ్యారు. మళ్ళీ ఇపుడు అవే విమర్శలను రిపీట్ చేశారు. నిజానికి పవన్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా జనాలకు వచ్చే నష్టమేమీలేదు. పెళ్ళిళ్ళు చేసుకోవటం, విడాకులు ఇవ్వటమన్నది పవన్ వ్యక్తిగతం. అందులో ఇంకోరి ప్రమేయం అవసరమే లేదు. అందునా పవన్ చట్టవిరుద్దంగా ఒకరికి తెలియకుండా మరోకరిని చేసుకోలేదు. ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాతే మరొకరిని చేసుకున్నారు.

 

జగన్  మాట్లాడుతూ పవన్ నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నట్లు  చెప్పారు. మరి తెలిసి చప్పారో తెలీకుండా చెప్పారో కానీ తప్పు చెప్పారు. పవన్ చేసుకున్నది మూడు పెళ్ళిళ్ళే. మొదటి ఇద్దరికీ విడాకులు ఇచ్చిన తర్వాతనే మూడో పెళ్ళి చేసుకున్నారు. అందులో తప్పేమీ లేదు. జగన్ లాంటి నేత కూడా ఏదో రచ్చబండ దగ్గర మాట్లాడుకునే మాటలను పాదయాత్రలో జనాల ముందు మాట్లాడటం ముమ్మాటికీ తప్పే. జగన్ అవినీతిపరుడని పవన్ అంటే దానికి ధీటుగా రిప్లై ఇవ్వాలి. నిజానికి రాజకీయంగా పవన్ పై మాట్లాడాలంటే చాలా అంశాలే ఉంటాయి.  

 

చంద్రబాబు + పవన్ బంధం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అలాగే పవన్ రాజకీయ పరిజ్ఞానం గురించి మాట్లాడటానికి కూడా బోలెడన్ని అంశాలున్నాయి. పవన్, చంద్రబాబు బంధం గురించి మాట్లాడిన జగన్ అక్కడితో వదిలేయకుండా పవన్ భార్యల గురించి మాట్లాడి తప్పు చేశారనే చెప్పాలి. పవన్ గురించి మాట్లాడటానికి ఎక్కువ మ్యాటర్ లేకపోతే చంద్రబాబు, లోకేష్ మాట్లాడటానికి అంశాలకైతే కొదవ లేదు కదా ? ఇక్కడ జగన్ ఓ విషయం గుర్తుంచుకోవాలి.

 

మొన్న జగన్ పై జరిగిన హత్యాయత్నంపై టిడిపి ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను సీన్ లోకి తెచ్చారు. అప్పుడు ఎంఎల్సీ వ్యాఖ్యలను పవన్ తప్పు పట్టిన విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. అవన్నీ వదిలిపెట్టి పవన్ భార్యల గురించి మాట్లాడితే జగన్ కు నష్టమే తప్ప లాభమేమీ ఉండదని గ్రహించాలి.