జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కోసారి పెద్ద జోకులేస్తుంటారు. తాజాగా అటువంటి జోకే వేశారు. అదేమిటంటే జనసేన అంటే వైసిపికి భయమట. తమ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు కాబట్టే జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ తో పాటు ఆయన మద్దతుదారులపై కేసులు పెట్టారని పవన్ ఆరోపించారు. రాపాక అంటే భయంవల్లే చిన్న సంఘటన ఆధారంగా ఏకంగా ఏడు కేసులు పెట్టినట్లు పవన్ తీర్మానించేశారు.
151 మంది ఎంఎల్ఏల అఖండ మెజారిటితో ప్రభుత్వంలోకి వచ్చిన జగన్ కు కేవలం ఒకే ఒక ఎంఎల్ఏ ఉన్న జనసేన అంటే ఎందుకు భయపడుతున్నారో మాత్రం పవన్ చెప్పలేదు. అసలు జనసేనను చూసి భయపడాల్సిన అవసరం జగన్ కు ఏముంటుందని కూడా పవన్ ఆలోచించలేదు. పైగా జగన్ చర్యలకు 23 మంది ఎంఎల్ఏలున్న టిడిపి భయపడినా తాము మాత్రం భయపడేది లేదని కూడా ఓ హెచ్చరిక చేసేశారు.
మామూలుగానే పవన్ మాటల్లో క్లారిటి ఉండదు. ఒక అంశంతో మొదలుపెట్టి మరో అంశంలోకి వెళిపోతుంటారు. అలాగే ఒకేసారి అనేక అంశాలను కలగాపులగం చేసేసి మాట్లాడేస్తుంటారు. పేకాటాడుతు పట్టుబడిన మద్దతుదారులను విడిపించేందుకు నానా రచ్చ చేసిన రాపాకను పవన్ మందలించి ఉంటే బాగుండేది. మద్దతుదారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంఎల్ఏపైన ఉంది. అయితే పోలీసులతో గొడవ పడటం, ఏకంగా పోలీసుస్టేషన్ పైనే దాడి చేయటమైతే మార్గంకాదు.
ముందు తప్పు చేసిన తన ఎంఎల్ఏకి క్లాసు పీకాల్సిన పవన్ రాపాకను వెనకేసుకొచ్చారు. అదే సమయంలో కేసుపెట్టి యాక్షన్ తీసుకున్న పోలీసులను పనిలో పనిగా జగన్ కు కూడా ఓ విచిత్రమైన వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంఎల్ఏను భయపెడుతున్నారంటూ బేస్ లెస్ అలిగేషన్ చేశారు. నిజానికి జగన్ అధికారంలోకి రాగానే వైసిపిలోకి వచ్చేస్తానని రాపాక అడిగారని ప్రచారం జరిగింది. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ లేకపోతే ఎప్పుడో రాపాక వైసిపిలో చేరిపోయుండేవాడే. వాస్తవాలు ఇలావుంటే పవన్ మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది.