ఏమిటో చంద్రబాబునాయుడు మాటలు ఓ పట్టానా ఎవరికీ అర్ధం కావటం లేదు. విభజన హామీలు రాబట్టటంలో, ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ సాధించటంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యింది వాస్తవం. నాలుగేళ్ళు ఎన్డీఏతో ఉండి కూడా ప్రయోజనాలను రాబట్టుకోవటంలో విఫలమయ్యారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాష్ట్రప్రయోజనాలను కేంద్రానికి తాకట్టుపెట్టేశారు. ఎంఎల్ఏ నియోజకవర్గాల పెంపు, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించటమనేది జరగదని తెలిసే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. అప్పటి నుండి నరేంద్రమోడి మీద ఒంటికాలిపై లేస్తున్నారు.
సరే హోదా కోసం మొదటి నుండి ఎవరు పోరాడుతున్నారు ? ప్రత్యేకహోదా పై చంద్రబాబు ఎన్నిసార్లు పిల్లిమొగ్గులు వేశారు ? అన్న విషయాలను ఎవరినడిగినా చెబుతారు. అయితే, తాజాగా ఢిల్లీలో దీక్ష చేసి తిరిగి వచ్చేశారు. ఆ సందర్భంగా అమరావతిలో మాట్లాడుతూ ఢిల్లీలో చేసిన ధర్మపోరాట దీక్షతో చరిత్ర సృష్టించినట్లు చెప్పారు. ధర్మపోరాటమేంటో చరిత్రేమిటో చంద్రబాబుకే తెలియాలి. చెయ్యాల్సిన పనులు చేయటంలో ఫెయిలై వాటికోసం ఇపుడు పోరాటం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు.
ఢిల్లీలో ధర్మపోరాట దీక్షతో నైతిక విజయం కూడా సాధించేసినట్లు చెప్పేసుకున్నారు. చిన్న పిల్లలు తమ ప్రోగ్రెస్ కార్డుల్లో మార్కులు దిద్దేసుకుని తండ్రి సంతకాలు కూడా చేసేసినట్లుగా ఉంది చంద్రబాబు పద్దతి. అంటే తనకు తానుగా చరిత్రని, నైతిక విజయమని తన భుజాన్ని తానే చరుచుకుంటున్నారు. అదే సమయంలో బిజెపిని చచ్చిన పాముతో పోల్చారు. నిజానికి బిజెపి అన్నది ఓ తాడు మాత్రమే. చంద్రబాబే తాడును చూసి పాముగా భయపడుతున్నారు.
అదే సమయంలో వైసిపిని బురదపాముతో పోల్చారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీని బురదపాముతో పోల్చటంలోనే చంద్రబాబు ఆక్రోశమంతా కనబడుతోంది. పోయిన ఎన్నికల్లో ఎక్కడో అదృష్టం ఉండబట్టే చంద్రబాబుకు పదవీయోగం దక్కిందన్నది వాస్తవం. జగన్ కు అదృష్టం వెంట్రుకవాసిలో అధికారాన్ని కోల్పోయారు. వచ్చే ఎన్నికల్లో జగన్ దే అధికారమని విపరీతమైన ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియా చేసిన సర్వేలో కూడా అదే విషయం స్పష్టమవుతోంది. సర్వేల్లో చెప్పినట్లు జగన్ అధికారంలోకి వస్తారో లేదో తెలీదు కానీ ఇఫ్పటికైతే జగన్ అంటే మండిపోతున్నారు. అందుకనే వైసిపిని బురదపాముతో పోల్చి తన అక్కసు తీర్చుకుంటున్నారు.