విశాఖ భూ కుంభకోణం వ్యవహారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా.? ఔనో, కాదోగానీ.. ఆ దిశగా అయితే టీడీపీ అనుకూల మీడియా కథనాల్ని వండి వడ్డిస్తోంది.
సొంత ఛానల్, పత్రిక పెడతానని ఇటీవల విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ పావులు కదిపే వ్యూహమేనంటూ టీడీపీ అనుకూల మీడియా విశ్లేషిస్తోంది. నిజానికి, విజయసాయిరెడ్డి నేరుగానే ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుని టార్గెట్ చేశారు. మరోపక్క, టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన ఎప్పటినుంచో టార్గెట్‌గా పెట్టుకున్నారు. అది కొనసాగుతూనే వుంది.
ఎక్కడా, ఏ కోణంలోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి టార్గెట్ చేసే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడు. అప్పట్లోనే విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారిపోతారంటూ టీడీపీ అనుకూల మీడియా కథనాల్ని వండి వడ్డించింది. కానీ, అలా జరగలేదు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి విజయసాయిరెడ్డిని విడదీయాలని టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా ఎన్నో ఏళ్ళ నుంచీ ప్రయత్నాలు చేస్తూనే వున్నాయి.. ఆ ప్రయత్నాలేవీ సఫలం కావడంలేదు కూడా. అయినాగానీ, కొండకి వెంట్రుక వేసి లాగిన చందాన, టీడీపీ అలాగే టీడీపీ అనుకూల మీడియా తన ప్రయత్నాలు కొనసాగించక తప్పడంలేదు.
వైసీపీలో ఒకప్పుడు విజయసాయిరెడ్డి నిర్వహించిన బాధ్యతలకీ, ఇప్పుడు నిర్వహిస్తున్న బాధ్యతలకీ చాలా తేడా వున్నమాట వాస్తవం. ఆయనకు వైసీపీలో కొంతమేర ప్రాధాన్యత తగ్గుతోందంటే దానిక్కారణం.. పార్టీలో మరికొందరు నేతలు రాజకీయంగా ఎదుగుతున్నారనే అర్థం. అలాగని, జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా అయితే విజయసాయిరెడ్డికి ఇంకా పోలేదు కదా.!
వైసీపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డికి అమిత ప్రాధాన్యత కొనసాగిస్తూనే వున్నారు. అలాంటప్పుడు, విజయసాయిరెడ్డి ఎందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురుతిరుగుతారు.?