ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన తర్వాత కూడా చంద్రబాబునాయుడును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెనకేసుకొస్తున్నట్లే ఉన్నారు. ఎన్టీయార్ కు జరిగిన వెన్నుపోటు విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ విషయంలో చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వెన్నుపోటు గురించి వెంకయ్య ప్రస్తావిస్తూ ఒకసారి ఎన్టీయార్ దగ్గరకు వెంకయ్య వెళ్ళారట. ఆ సమయంలో కొందరు ఆడపడుచులు ఎన్టీయార్ కు పాదాభివందనం చేస్తున్నారట. పాదాభివందనం చేయటం మంచిది కాదని వెంకయ్య వారించారట. దానికి ఎన్టీయార్ బదులిస్తు పాదాభివందనం చేస్తున్నారంటే అది వాళ్ళ ప్రేమ అని అన్నారట. కానీ, 6 నెలల తర్వాత వాళ్ళే ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచారంటూ వెంకయ్య చెప్పటమే పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇక్కడ వెంకయ్య మాటలు ఎంత వరకూ వాస్తవమో చూద్దాం. ఎన్టీయార్ వెన్నుపోటు ఉదంతం జరిగింది 1995లో. అంటే అప్పటికి వెంకయ్య స్ధాయి ఏమిటి ? బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాత్రమే. అంటే నేరుగా ఎన్టీయార్ నే ఆక్షేపించే స్ధాయి వెంకయ్యకు లేదనే అర్ధమవుతోంది. పైగా ఎన్టీయార్ కు పాదాభివందనం చేయటం 1995లోనే మొదలవ్వలేదు. సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే అభిమానులు ఎన్టీయార్ కు పాదాభివందనం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువయ్యుంటుందంతే.
ఆ మాటకొస్తే ఇందిరాగాంధి, రాజీవ్ గాంధి, ఎంజిఆర్, కరుణానిధి, వాజ్ పేయ్ లాంటి వాళ్ళకు కూడా ఎంతో మంది అభిమానులు పాదాభివందనం చేయటం అందరూ చూసిందే. కాబట్టి ఎన్టీయర్ కు పాదాభివందనం చేయటాన్ని తాను ఆక్షేపణ చేశానని వెంకయ్య చెప్పుకోవటమంటే కాదనే వాళ్ళు ఇపుడు లేరన్న ధైర్యమే కనబడుతోంది. పైగా పాదాభివందనం చేసిన ఆడబడుచులే 6 మాసాల తర్వాత వెన్నుపోటు పొడిచారని చెప్పటమే వింతల్లో వింత. ఎందుకంటే, ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచింది స్వయంగా కుటుంబసభ్యులే కానీ పాదాభివందనం చేసిన వాళ్ళు కాదు. పైగా ఆడపడుచులు అనే పదం వాడారు వెంకయ్య. కాబట్టి ఎన్టీయార్ కు పాదాభివందనం చేసిన ఆడబడుచులెవరో వెంకయ్యే బయటపెట్టాలి.
నిజానికి ఎన్టీయార్ పైన అభిమానులకున్నంత ప్రేమ, అభిమానం కుటుంబసభ్యులకు లేదనే చెప్పాలి. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రవ్వాలన్న చంద్రబాబు కుతంత్రానికి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కొడుకులు, కూతుళ్ళు అందరూ యధాశక్తి సహకరించారు. వాస్తవిమదైతే వెంకయ్య చరిత్రను వక్రీకరిస్తు పరోక్షంగా వెన్నుపోటులో చంద్రబాబు పాత్ర లేదని చెప్పటానికి తాపత్రయపడుతున్నట్లే కనిపిస్తోంది. వెంకయ్య లాంటి వాళ్ళు ఎంత పాకులాడినా వెన్నుపోటు ఘటనలో చరిత్రను మార్చి లేరన్నది విషయం వాస్తవం.
