టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి వారివల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని, వివాదాలు తప్ప… మాకు కొత్తగా వచ్చింది ఏమీ లేదు.. అని వైసీపీలో సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల వల్ల సీఎం జగన్ కి పెద్ద తలనొప్పే వచ్చిపడుతుందట. టీడీపీ తరఫున గెలిచిన వారిలో నలుగురిని ప్రత్యక్షంగా వైసీపీకి మద్దతు దారులుగా మార్చడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఫలితంగా అసెంబ్లీలో టీడీపీ వాయిస్‌ను తగ్గించేందుకు ప్రయత్నించినట్టు అయింది. కానీ, అదే సమయంలో సొంత పార్టీలో మాత్రం కుమ్ములాటలు పెరిగిపోయాయి.
కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ తరఫున గెలిచిన వంశీ.. వైసీపీకి మద్దతుదారుగా మారారు. కానీ, ఇక్కడ వైసీపీ నేతల దూకుడుతో ఆయన తర్జన భర్జన పడుతున్నారు. వైసీపీ నుంచి వంశీకి గత రెండు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరూ వంశీని అణగదొక్కేందుకు చూస్తున్నారు. పార్టీ మారినా వంశీకి ఏ మాత్రం ప్రశాంతత లేదు. దీంతో పార్టీ మారి తప్పు చేశానా ? అనే ఆలోచనలో వంశీ ఉన్నారన్నది నిజం. ఇక, ప్రకాశం జిల్లా చీరాలలోనూ ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఏకంగా ఆమంచి కృష్ణమోహన్‌తో ఈ అంటే.. డీ అనే రేంజ్‌లో కరణం బలరాం తలపడుతున్నారు. అదేవిధంగా గుంటూరు వెస్ట్‌లో సైలెంట్‌గానే ఉన్నా.. ఇక్కడ నుంచి గెలిచిన మద్దాలి గిరి దూకుడుతో వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు.
గెలిచి వచ్చిన నాయకులనే కాదు ఓడిన వారిని కూడా పార్టీలోకి తీసుకున్నారు. వీరివల్ల కూడా పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వీరిలో శిద్దా రాఘవరావు సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్నా తోట త్రిమూర్తులకు అమలాపురం పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఇచ్చినా ఉపయోగం లేదు సరికదా ? ఆయన వచ్చాక పార్టీలో ఐదారు నియోజకవర్గాల్లో గ్రూపుల గోల ఎక్కువైంది. పోనీ.. పార్టీలో ఇప్పటికే ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని.. కొత్తగా వచ్చిన వారు దూకుడు తగ్గించాలనే సంకేతాలను కూడా పార్టీ అధిష్టానం ఇవ్వలేక పోతోంది. దీంతో ఎక్కడికక్కడ వివాదాలు.. విభేదాలతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని పలువురు పెద్దలు వాపోతున్నారు.