“ఈనాడు” తుత్తర ఫలితం అనుభవిస్తున్న టీడీపీ!

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సక్సెస్ అయ్యి.. అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇక ఇప్పటికే పార్టీ తరఫున నిర్వహించిన “బాదుడే బాదుడు”, “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” వంటి కార్యక్రమాలు వియవంతం చేయడానికి బాబు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇక “యువగళం” పేరుతో చినబాబు 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టడం, ప్రస్తుతం ఆ పనిలో ఉండటం తెలిసిందే. అయితే… తండ్రీకొడుకులిద్దరూ ఏదో కిందా మీదా పడుతుంటే… వీరి ప్రయత్నానికి వారి అనుకూల మీడియాగా పేరున్న “ఈనాడు” చూపిస్తున్న తుత్తరో, అత్యుత్సాహమో… టీడీపీని డ్యామేజ్ చేస్తుందనే కామెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి!

అవును… చంద్రబాబుని ఏదోలా అధికారంలోకి తీసుకురావాలనో, జగన్ ని గద్దెదింపాలనో ఈనాడు చూపిస్తున్న అత్యుత్సాహం.. బౌన్స్ బ్యాగ్ అవుతందనే కామెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల కిందటి సంగతి… గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తదితరులు రేపిన కాక అంతా ఇంతాకాదు. దీంతో… పోలీసులపై దాడిచేశారంటూ పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో తనను ముసుగేసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు కొట్టారని, చితక్కొట్టారని చెప్పుకొచ్చారు పట్టాభి.

అతను అలా చెప్పారో లేదో.. కొన్ని ఫోటోలు వెలికితీసి అచ్చేసేసింది ఈనాడు. పట్టాభిని చితక్కొట్టేశారని కథనాలు రాసేసింది. అయితే… మెడికల్ టెస్టుల్లో మాత్రం పట్టాభికి ఏగాయం కాలేదని, అతనిని పోలీసులు కొట్టలేదని తేలింది. ఇదే సమయంలో ఆ పత్రిక అచ్చేసిన ఫోటోలు పాతవని తేలింది. దీంతో ఆ పత్రిక యాజమాన్యం క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో… ఆ పత్రిక క్రెడిబిలిటీ పడిపోవడం సంగతి అటుంచి… ఆ ప్రభావం టీడీపీపై బలంగా పడింది. టీడీపీ – ఈనాడు కలిపి జగన్ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కామెంట్లు పెరిగిపోయాయి.

ఇక తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను సీఎం జగన్ ఆహ్వానించలేదని.. సీఎం వచ్చే వరకు గవర్నర్ ఎదురుచూడాల్సి వచ్చిందని ఆ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చెప్పినట్టుగా రాసుకొచ్చింది. సీఎం జగన్.. గవర్నర్ కు ఆహ్వానం పలికినట్టు వీడియో క్లిప్పులతో సహా అసెంబ్లీలో అధికార పక్షం వైసీపీ ప్రదర్శించింది. దీంతో ఈ వ్యవహారం కూడా బూమరాంగ్ అయ్యింది. ఆ పత్రిక చేసిన పని, తమ్ముళ్లు చూపించిన ఉత్సాహానికి ఆ ఫలితం టీడీపీకి దక్కింది.

ఎల్లో మీడియా తమపై అసత్య కథనాలు రాస్తోందని ఇప్పటికే వైసీపీ ఎన్నోసార్లు ఆరోపించింది. చంద్రబాబు అధికారంలోకి తేవడమే ఎల్లో మీడియా లక్ష్యమంటూ వైసీపీ నేతలు సైతం నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తొందరపాటు చర్యలతో ఆ పత్రిక చేస్తున్న పనులు… వెంటిలేటర్ పై ఉన్న టీడీపీని ఇంకా ఇబ్బందిపెడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి! మరి ఇకనైనా ఆ పత్రిక తన తుత్తర తగ్గించుకుంటుదా.. లేక, టీడీపీని – బాబుని ఇంకా పతనావస్తలోకి నెడుతుందా అన్నది వేచి చూడాలి!