ఇపుడిదే అనుమానం వస్తోంది అందరిలోను. గుంటూరు జిల్లాలోని వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదుగుల వేణుగోపాల రెడ్డి విషయం ఇపుడు జిల్లాలో హాట్ టిపిక్ అయ్యింది. చూస్తుంటే మోదుగులను బలవంతంగా టిడిపి నుండి బయటకు తరిమేసేట్లున్నారు. మోదుగుల తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరుతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే మోదుగుల మాత్రం ఆ విషయాన్ని అధికారికంగా ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు.
మరి ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా. అందుకనే చంద్రబాబునాయుడు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. అందులో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం కూడా ఒకటి. మోదుగుల పార్టీలో ఉంటారో తెలీదు, వెళ్ళిపోతారో తెలీదు. దాంతో టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఒక సమస్య. చేయకపోతే మరో సమస్య. దాంతో మోదుగుల విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.
అయితే, పార్లమెంటు అభ్యర్ధి గల్లా జయదేవ్ మాత్రం మోదుగులకు టికెట్ ఇవ్వద్దంటూ చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. మోదుగుల వల్ల లోక్ సభ నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. కాబట్టి మోదుగులకు ప్రత్యామ్నాయంగా వేరే నేతను చూడాలంటూ చెప్పారట. దాంతో మోదుగుల పార్టీని వీడకున్న బలవంతంగా పార్టీ నేతలే బయటకు పంపేసేట్లున్నారని ప్రచారం జరుగుతోంది.
పనిలో పనిగా రాబోయే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సినీనటుడు ఆలీని పార్టీ తరపున పోటీ చేయించటానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే ఆలీ కూడా నియోజకరవర్గం పరిధిలోనే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తొందరలో ఇల్లు కూడా తీసుకుంటున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టిడిపి తరపున ఆలీయే అభ్యర్ధిగా అర్ధమైపోతోంది. కాబట్టి మోదుగుల ఆలస్యం చేసేకొద్దీ ఏ పార్టీలో కూడా టికెట్ దక్కేట్లు లేదు.