కోడెలపై టిడిపి నేతల తిరుగుబాటు ?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై తెలుగుదేశంపార్టీ నేతలు తిరుగుబాటు లేవదీశారు. కచ్చితంగా చెప్పాలంటే టిడిపి నేతలందరూ కూడబలుక్కున్నట్లుగా కోడెలను బహిష్కరించినట్లే ఉంది.  జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోని టిడిపి నేతలెవరూ కోడెలతో మాట్లాడటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. అందుకనే ఆయన్ను తప్పించుకుని తిరుగుతున్నారు.

అసలు ఎన్నికల ముందే ఆయనకు పై రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా టికెట్ ఇవ్వొద్దంటూ భారీ నిరిసన ప్రదర్శనలే నిర్వహించారు. అప్పట్లో కోడెలపై నేతల బహిరంగ తిరుగుబాటు పెద్ద సంచలనం రేపింది. అయినా సరే అందరినీ సర్దుబాటు చేసి చంద్రబాబు కోడెలకు సత్తెనపల్లిలో టికెట్ ఇచ్చారు. అయితే  ఏం లాభం పార్టీ నేతలు, జనాల వ్యతిరేకత వల్ల కోడెల ఘోరంగా ఓడిపోయారు.

సరే ఎన్నికలకు ముందు అయ్యిందేదో అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అధికారంలో ఉండగా కోడెలను అడ్డుపెట్టుకుని కొడుకు శివ రామకృష్ణ, కూతురు విజయలక్ష్మి జనాలను ఐదేళ్ళు  పీక్కుతినేశారు. అందులో కూడా మళ్ళీ తన మన అని ఏమాత్రం మొహమాట పడలేదు. అవసరార్ధం వచ్చిన వాళ్ళను, అవసరంలో ఉన్నారని తెలుసుకున్న వాళ్ళని చెరకుగడను పీల్చి పిప్పిచేసినట్లు చేశారు.

ఆ దెబ్బకు కోడెల కుటుంబమంటేనే రెండు నియోజకవర్గాల్లోని నేతలు మండిపోతున్నారు. అందుకనే కోడెల పాల్గొన్న ఏ సమావేశంలోను నేతలు పాల్గొనటం లేదు. ఏ సమావేశంలో అయినా కోడెల పాల్గొంటే తాము పాల్గొనేది లేదని చంద్రబాబునాయుడు మొహం మీదే చెప్పేశారట. అదే సమయంలో సయోధ్య కోసం తన ఇంటికి రావాలంటూ కోడెల కబురు పంపుతున్నా ఏ నేత కూడా స్పందించటం లేదు. కోడెల పరిస్ధితి ఎంత దారుణంగా తయారయ్యిందో అందరికీ అర్ధమైపోయింది.