వైసిపి ఆయువుపట్టుపై టిడిపి దెబ్బ ?

రాబోయే ఎన్నికల్లో వైసిపిని దెబ్బ కొట్టేందుకు తెలుగుదేశంపార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసిపికి ఆయువుపట్టుగా ఉన్న సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏ పార్టీకైనా ప్రచారమంటే మీడియానే అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. అటువంటిది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మెజారిటీ జగన్మోహన్ రెడ్డిని తొక్కిపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపధ్యంలోనే జగన్ ను సోషల్ మీడియా ఆదుకుంటోంది.

 

వైసిపికి వస్తున్న ప్రచారంలో జగన్ మీడియాను పక్కనపెడితే మిగిలిందంతా సోషల్ మీడియా ద్వారా వస్తున్నదని చెప్పటంలో సందేహం అవసరం లేదు. చంద్రబాబునాయుడు, లోకేష్ లేదా ఇతర మంత్రులు, నేతల ప్రకటనలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా చీల్చి చెండాడేస్తోంది. వారి ప్రస్తుత ప్రకటనలను గతంలో వారు మాట్లాడిన విషయాలను కూడా తవ్వి తీసి జనాల ముందుంచుతోంది. ఫేస్ బుక్, వాట్సప్,  ట్విట్టర్, ఇన్ట్సాగ్రామ్ లాంటి మీడియాలో వేలకొద్ది  వైసిపి యాక్టివిస్టులు చాలా యాక్టివ్ గా ఉన్నారు. దాంతో వైసిపిని తట్టుకోవటం టిడిపి బాగా ఇబ్బంది పడుతోంది. వైసిపి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న వారిని గతంలోనే అరెస్టులు చేసిన ప్రభుత్వం త్వరలో మరికొంతమంది అరెస్టుకు రెడీ అవుతున్నట్లే ఉంది.

 

జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై వైసిపి నేతలు ఒకలాగ రియాక్టయితే చంద్రబాబునాయుడు అండ్ కో మరోలాగ రియాక్టయ్యింది. అయితే, చంద్రబాబు అండ్ కో లో టిడిపి ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ మాత్రం చాలా అసహ్యంగా కామెంట్లు చేశారు. జగన్ హత్యాయత్నానికి తల్లి విజయమ్మ, సోదరి షర్మిలే కుట్ర పన్నినట్లు చాలా అసభ్యంగా మాట్లాడారు. ఈయన నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తుంటారు. ఎదుటి వారు ఛీ కొడతారన్న జ్ఞానం, సిగ్గు ఏమీ ఉండదు. చంద్రబాబును సంతోషపెట్టటానికి జగన్ పై ఎంత అసహ్యంగా అయినా మాట్లాడుతారు.

 

అందులో భాగంగానే జగన్ తల్లి, సోదరిపై రాజేంద్రప్రసాద్ కామెంట్ చేయగానే ఎంఎల్సీ కుటుంబంపై వైసిపి సోషల్ మీడియా రెచ్చిపోయింది. రాజేంద్రప్రసాద్ భార్య, కూతురు జీవితాలను రోడ్డున పడేసింది.  నిజంగా సోషల్ మీడియాలో వచ్చింది తప్పనే చెప్పాలి. అయితే, ఎప్పుడైతే రాజేంద్రప్రసాద్ జగన్ తల్లి, సోదరి గురించి మాట్లాడారో ఆ తర్వాతే వైసిపి సోషల్ మీడియా రెచ్చిపోయిందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇపుడు ఆ విషయంలోనే ఎంఎల్సీతో పాటు కొందరు ఉయ్యూరు టిడిపి నేతలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్య, కూతురుపై అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ 16 మందిపై ఎంఎల్సీ, నేతలు ఫిర్యాదు చేశారు. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.