ఎన్టీఆర్.. ఈ పేరుకు తెలుగుదేశం పార్టీలు విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్నికల్లో ఓట్లు రాలాలంటే ప్రచారంలో ఈ పేరు వినబడాల్సిందే. ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడు ఈ పేరును జపించాల్సిందే. ఎన్టీఆర్ నుండి పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా చేరింది, మధ్యలో నందమూరి కుటుంబం ఎంతలా నలిగిపోయింది అందరికీ తెలుసు. తెలుగు తమ్ముళ్లే ఇందుకు ప్రత్యక్ష సాక్షులు. ఆ సాక్షులు చాలామంది ఇప్పటికీ పార్టీలో ఉన్నారు. మనసులో ఏదో ఒక మూల ఉండాల్సింది ఇలా కాదు అనే భావన ఉన్నా తప్పక పార్టీలో ఉంటున్నారు చాలామంది. చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్న అతికొద్దిమంది వ్యక్తులు తప్ప దాదాపు పార్టీలో అందరి భావన ఇదే. ఎప్పటికైనా పార్టీ అసలు సిసలు వారసుల చేతుల్లోకి వెళితే చూడాలని ఎదురుచూస్తున్న కార్యకర్తల సంఖ్య కోకొల్లలు.
బాలకృష్ణ మీద ఏనాడో ఆశలు వదిలేసుకున్న అందరూ జూ.ఎన్టీఆర్ మీదే హోప్ పెట్టుకున్నారు. ఆయన పార్టీలోకి రాకపోతారా పగ్గాలు అందుకోకపోతారు అని ఎదురుచూస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఈ ఎదురుచూపుల మీద నీళ్లు చల్లుతూనే ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు అక్కున చేర్చుకుని పబ్బం గడవగానే పక్కనపెట్టేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. 2009 ఎన్నికల్లో చంద్రబబు నాయుడు పిలుపు మేరకు ప్రచార భాద్యతలను భుజానికెత్తుకున్న చిన్న రాముడు బాగానే పనిచేశారు. కానీ పార్టీ ఓడిపోవడం, కొందరి కుట్రలు కారణంగా ఆయన పనితనం హైలెట్ కాలేదు. కానీ టీడీపీ శ్రేణులకు మాత్రం ఎన్నికల ప్రచారంలో తారక్ జనాకర్షణ ఎలాంటిదో తెలిసొచ్చింది. అప్పటి నుండి ఆయన పూర్తి స్థాయిలో పార్టీలోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం బలపడింది.
అయితే బాబుగారు ఎప్పటికప్పుడు టైమ్ చూసి గండికొట్టేస్తూనే ఉన్నారు. అయినా శ్రేణుల్లో ఆ ఆశలు నశించలేదు. ఏదో ఒక రూపంలో జూనియర్ ప్రస్తావనను తీసుకొస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పార్టీ కష్టాల్లో ఉంది. తారక్ విజృంభించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్న వారంతా చంద్రబాబును కలవరపెడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో అయినా పెద్దాయన వారసులను ఆదరిస్తే మేలు జరుగుతుందని హింట్లు ఇస్తున్నారు. కొందరైతే బాహాటంగానే ఎన్టీఆర్ ను పార్టీలోకి తేవాలని చెప్పేస్తున్నారు. తాజాగా ఏఏపీ నెక్స్ట్ సీఎం అంటూ ఎన్టీఆర్ ఫోటోలతో వెలసిన ఫ్లెక్సీలే ఇందుకు సాక్ష్యం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వేసిన ఈ ఫ్లెక్సీలు ప్రజెంట్ టీడీపీలో హాట్ టాపిక్ అయ్యాయి.
అధిష్టానం సైతం కలవరపడుతోంది. మళ్ళీ ఒరిజినల్ వారసత్వం గొడవ మొదలైందా అని తలలు పట్టుకుంటున్నారు చంద్రబాబు అండ్ కో. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి కళ్యాణ్ రామ్ ను బరిలోకి దింపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారనే టాక్ ఉంది. నిజంగా అలా చేయాలంటే నందమూరి కుటుంబానికి సడలింపులు ఇవ్వాల్సిందే. ఆ సడలింపుల్లో ఎన్టీఆర్ గనుక దూసుకొచ్చేస్తే ఇక ఆపడం తరం కాదని, తట్టా బుట్టా సర్దుకోవాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారట. ఈ పరిణామాలన్నీ పార్టీలోని మెజారిటీ శ్రేణులకు ఆసక్తిని, ఆనందాన్ని కలిగిస్తున్నాయి.