ఎన్టీఆర్ కారు చలానా క‌ట్టిన అభిమాని.. రిట‌ర్న్ గిఫ్ట్‌గా ఆర్ఆర్ఆర్ టిక్కెట్ కావాలంటూ రిక్వెస్ట్

విశ్వ‌విఖ్యాత న‌ట‌సౌర్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచి న‌టులుగా ఎదిగారు. వారి త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్, తార‌క ర‌త్న‌వంటి వారు కూడా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నంద‌మూరి ఫ్యామిలీలో ఇప్పుడు మంచి ఆద‌ర‌ణ ఉన్న హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డుగా అద్భుత‌మైన న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. సినిమా సినిమాకు ప‌రిణితి చెందుతూ త‌న క్రేజ్‌ని మ‌రింత పెంచుకుంటున్నాడు.

ప్ర‌స్తుతం రాజ‌మౌళితో క‌లిస ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తుండ‌గా, ఇందులో కొమురం భీం పాత్ర పోషిస్తున్నాడు. త‌న పాత్ర‌కు సంబంధించిన స్మాల్ వీడియో కొద్ది రోజుల క్రితం విడుద‌ల కాగా, ఇది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రించింది. ఎన్టీఆర్ న‌టిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని ప్రేక్ష‌కులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. అతి త‌క్కువ స‌మ‌యంలో అశేష అభిమాన‌గణాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువే . తాజాగా ఓ అభిమాని ఎన్టీఆర్‌పై అభిమానంతో ఆయ‌న కారుపై ఉన్న చ‌లానా పే చేశాడు. నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌లో పరిమితికి మించి కారు వేగంగా డ్రైవ్‌ చేసిన కారణంగా ఆయనకు 1,035 ఫైన్‌ వేశారు ట్రాఫిక్ పోలీసులు.

గ‌త కొద్ది రోజులుగా ఈ ఫైన్ ఇలానే పెండింగ్‌లో ఉండ‌డంతో అభిమాని ఒకరు చ‌లానా క‌ట్టి దానిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ, దానికి రిట‌ర్న్ గిఫ్ట్ అడిగాడు. ఆయ‌న అడిగిన గిఫ్ట్ ఏంటంటే తాను చెల్లించిన మొత్తానికి త‌గ్గ‌ట్టు ఆర్ఆర్ఆర్ టిక్కెట్స్ కావాలని అన్నాడు. అది కూడా మల్లికార్జున థియేటర్‌, భ్రమరాంబ థియేటర్స్‌లో. అభిమాని కోరిన ఈ కోరిక‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ తీరుస్తాడా, లేదంటే ఆయ‌న కోరిక క‌ల‌గానే మిగులుతుందా అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.