క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనపై హత్యాయత్నానికి దాడి చేసేందుకు ప్లాన్ జరుగుతోందిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆమధ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. భద్రత సరిగా లేదన్న కారణంతో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించిన విషయం కూడా తెలిసిందే.
అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షపై ప్రాణాపాయం లేని రీతిలో దాడి జరుగుతుందని ఆపరేషన్ గరుడ ముసుగులో సినీనటుడు శివాజి చెబితే ఎవరు అప్పట్లో పట్టించుకోలేదు. పైగా గుంటూరులో ఓ సారి దాడికి రెక్కీ కూడా నిర్వహిస్తారని లేకపోతే నిర్వహించారని శివాజి స్పష్టంగా చెప్పారు.
సరే శివాజికి ఆ విషయాలు ఎలా తెలిసాయి అన్నది వేరే విషయం. శివాజి దాడి గురించి దాదాపు మూడు నెలల ముందు అంత స్పష్టంగా చెప్పినా వైసిపి అగ్ర నేతలు తీసుకున్న ముందు జాగ్రత్తలు ఏమిటి అన్నదే అసలైన ప్రశ్న. ఒకవైపు ప్రభుత్వం తగినంత భద్రత ఇవ్వటం లేదని వైసిపి నేతలు గగ్గోలు పెడుతున్నారు. జడ్ క్యాటగిరిలో నేతకు సరైన భద్రత ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిందించేబదులు వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తాము తీసుకున్న భద్రత ఏమిటనే ప్రశ్న అందరిలోను మొదలైంది. పార్టీపరంగా ఎటువంటి భద్రత తీసుకోలేదని తెలిసిపోతోంది. జరగాల్సన నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా చంద్రబాబునాయుడు, శివాజి, డిజిపిపై ఎంత ఆరోపణలు చేసి ఉపయోగమేంటి ?
జరిగిన ఘటన చూసిన తర్వాత జగన్ వ్యక్తిగత భద్రతాధికారి, పార్టీపరంగా భద్రతా వ్యవహారాలు చూడాల్సిన నేత, రోజువారి కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునే నేతల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ఎడమభుజంపై గాయమైంది కాబట్టి సరిపోయింది. అదే నిందుతుడి లక్ష్యం నెరవేరుంటే జగన్ పరిస్దితేంటి ? చివరకు గ్రామస్ధాయి నుండి రాష్ట్రస్ధాయి వరకూ పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉందని చెప్పుకునే వైసిపికి పవన్ కల్యాణ్ కున్న ముందు జాగ్రత్త కూడా లేకపోతే ఎలా ?