విజయనగరం జిల్దాలో అనూహ్యం..దాయాదుల పోరు తప్పదా ?

రానున్న ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో దాయాదుల పోరు రసవత్తరంగా మారేట్లుంది. రాబోయే ఎన్నికల్లో గజపతిరాజు కుటుంబంలో దాయాదుల పోరు తప్పలేట్లు లేదు. ఆనంద గజపతిరాజు కూతురు సంచిత గజపతిరాజు బిజెపిలో చేరటంతో జిల్లా రాజకీయాల్లో అనూహ్య మలుపు తిరుగుతోంది. గజపతిరాజులంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  దశాబ్దాల తరబడి వీరు రాజకీయాల్లో ఉన్నా తెలుగుదేశంపార్టీలో చేరిన తర్వాతే పాపులరయ్యారు. టిడిపిలో సోదరులు ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతి రాజులు ఉత్తరాంధ్రలోనే కీలక పాత్ర పోషించారు. ఆనంద పలుమార్లు ఎంపిగా, ఎంఎల్ఏగా గెలిచారు. తర్వాత టిడిపి నుండి బయటకు వచ్చేశారు.

అశోక్ గజపతిరాజు చాలా సంవత్సరాలు ఎంఎల్ఏగా పనిచేసి ప్రస్తుతం ఎంపిగా ఉన్నారు. ఈమధ్యనే కేంద్రమంత్రిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రస్తుతానికి వస్తే వచ్చే ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజును విజయనగరం ఎంఎల్ఏగా పోటీ చేయించాలని అశోక్ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే ఆనంద కూతురు సంచిత గజపతిరాజు ఈరోజు బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు.

 

 ఇపుడు పార్టీలో చేరారంటేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు అర్ధమవుతోంది. కాకపోతే  ఏ స్ధానం నుండి పోటీ చేస్తుందన్నదే ప్రశ్న. ఎందుకంటే, ఎంపిగా పోటీ  చేసేట్లయితే పినతండ్రి అశోక్ పైనే పోటీ  చేయాల్సుంటుంది. ఎంపిగా కాకుండా ఎంఎల్ఏగా పోటీ అంటే అశోక్ కూతురు అదితిపై పోటీ చేయాలి. మరి ఏ స్దానం నుండి సంచిత పోటీకి దిగబోతోందో ఇంకా క్లారిటీ రాకపోయినా వచ్చే ఎన్నికలు మాత్రం దాయాదుల మధ్య పోరుతో రసవత్తరంగామారే సూచనలైతే కనబడుతోంది.