నరసరాపుపేట మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు కూడా తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో బిజెపిలో చేరేందుకు రంగం రెడీ అయినట్లు టిడిపి వర్గాలే చెబుతున్నాయి. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గుంటూరు పర్యటనలో రాయపాటి ఇంట్లోనే గంటపాటు భేటీ అయ్యారు. దాంతో రాయపాటి బిజెపిలో చేరిక ఖాయమైపోయింది.
మొన్నటి ఎన్నికలో ఎదురైన ఘోర పరాజయం నుండి చంద్రబాబునాయుడు కోలుకునే అవకాశం కనిపించటం లేదు. దాంతో చంద్రబాబు నాయకత్వంపై టిడిపి నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే ప్రత్యామ్నాయంగా చాలామంది బిజెపిలో చేరాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే టిడిపికి చెందిన ఆరుమంది రాజ్యసభ ఎంపిల్లో నలుగురు బిజెపిలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే.
వీరు కాకుండా ఇంకా చాలామంది బిజెపిలో చేరుతున్నారు. టిడిపి నేతలను వైసిపిలో చేర్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడకపోవటంతో వేరేదారి లేక బిజెపిలో చేరుతున్నారు. బిజెపిలోకి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ ఎంపిలు చంద్రబాబు అనుమతితోనే పార్టీ మారినట్లు అందరికీ తెలిసిపోయింది. దానికితోడు రాయపాటి కూడా చంద్రబాబుతో భేటీ అయి చర్చలు జరపటం ఆ ప్రచారానికి ఊతమిచ్చింది.
అంటే ఇక్కడ క్లియర్ గా అర్ధమవుతున్నదేమంటే టిడిపి నుండి బిజెపిలోకి వెళుతున్న నేతలంతా చంద్రబాబు అనుమతితోనే వెళుతున్నారని. బహుశా టిడిపి పరిస్ధితి మెరుగైనపుడు మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చేస్తామన్న హామీతోనే అందరూ వెళుతున్నారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.