ఈటెల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారా.? లేదా.?

Etela Shocking Decission on joining BJP?

Etela Shocking Decission on joining BJP?

మాజీ మంత్రి ఈటెల రాజేందర్, భారతీయ జనతా పార్టీలో చేరేందుకోసం ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. బీజేపీ జాతీయ స్థాయి నాయకులు కూడా ఈటెలతో చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తాను ఈటెలను కలుస్తానంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి నిన్ననే ఓ ప్రశ్నకు బదులిస్తూ చేసిన వ్యాఖ్యలు.. ఈటెల, బీజేపీలో చేరడం ఖాయమన్న విషయాన్ని స్పష్టం చేశాయి.అయితే, తాజాగా ఈటెల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను బీజేపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేశారు. తనకు తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా తీరని అన్యాయం జరిగిందనీ, తెలంగాణ ప్రభుత్వం తన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనీ, ఈ క్రమంలో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని సంకల్పించుకున్నాననీ, తనకు ఈ పోరాటంలో కలిసొచ్చేదెవరన్నదానిపైనే ఆయా పార్టీలకు చెందిన నేతలతో చర్చిస్తున్నానని ఈటెల చెప్పుకొచ్చారు.

తన రాజీనామా విషయమై కొంత గందరగోళం వున్న మాట వాస్తవమేనంటున్న ఈటెల రాజేందర్, త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాగా, ఉప ఎన్నిక విషయం.. తిరిగి పోటీ చేసే విషయమై ఈటెల రాజేందర్, కాంగ్రెస్ సహా బీజేపీ ఇతర పార్టీలు, ఉద్యమ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు అర్థం చేసుకోవాలేమో. బీజేపీలోనో, మరో పార్టీలోనో చేరకుండా, ఒంటరిగా రాజకీయం చేస్తానంటే ఈ రోజుల్లో అది అంత తేలికైన వ్యవహారం కాదని ఈటెల రాజేందర్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో. రోజులు మారాయ్.. బీజేపీనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ వెనుక గట్టిగా నిలబడేందుకు ఆస్కారం వుంది.. ఆ విషయం ఈటెలకి కూడా తెలుసు. కానీ, ఎందుకో బీజేపీ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారాయన.