టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని టీడీపీ నుంచి బయటకు పంపేయడానికి టీడీపీ అనుకూల మీడియా చాలానే కష్టపడింది. కాదూ, లేదూ.. ఇదంతా ఓ డ్రామాయేనా.? అంటే, ఏమైనా కావొచ్చుగాక. కానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా ప్రచారంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. సాయంత్రానికే సీన్ మారిపోయి.. ఆయన మెత్తబడ్డారు. ఏదైనా తాను సూటిగానే మాట్లాడతాననీ, పార్టీ బాగు కోసమే తాను ఆవేదన చెందుతున్నాననీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు. రాజీనామా సంగతేంటి.? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ కాబోతున్నారట. మరోపక్క, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించడంలో ప్రస్తుతానికి చంద్రబాబు సఫలమయ్యారు. అయినాగానీ, గోరంట్ల ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా.? అన్న అనుమానమైతే చంద్రబాబులో వుంది.
దాంతో, గోరంట్లతో టచ్‌లో వుండాలంటూ పార్టీ ముఖ్య నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తానే స్వయంగా ఆయనతో మాట్లాడుతూ వుంటానని కూడా చంద్రబాబు చెప్పారట. అయితే, గోరంట్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబుని ఎందుకు కలవలేకపోతున్నారు.? అన్నది చర్చనీయాంశంగా మారింది. నారా లోకేష్ అయినా స్వయంగా రంగంలోకి దిగి, ఈపాటికే ఆయన్ను బుజ్జగించి వుండొచ్చు కదా.? ఏమో, గోరంట్ల మనసులో ఏముందోగానీ, రాజమండ్రి నగరంలో.. టీడీపీ ఒకింత ఇబ్బందికర పరిస్థితుల్నే ఎదుర్కొంటోంది. అధికార పక్షం వైసీపీ నుంచి ఎదురవుతున్న సవాళ్ళ సంగతి పక్కన పెడితే, సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అటు నాయకులకీ, ఇటు పార్టీకీ నష్టం చేస్తున్నాయి. అధినేత చంద్రబాబు మాత్రం ఈ విషయాల్ని అంత సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది.