బిజెపిలోకి రాయపాటి వర్గం జంప్ ?

కోడెల శివప్రసాద రావు  కారణంగానే  రాయపాటి వర్గం తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తోంది. కోడెల-రాయపాటి వర్గాల రాజకీయాల వైరం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది.  నరసరావుపేట, సత్తెనపల్లిలో టిడిపి సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఎంత పలుకుబడి ఉండేదో అందరికీ తెలిసిందే. అయితే అదంతా చరిత్రలాగైపోయింది.

ఐదేళ్ళు స్పీకర్ గా ఉన్నకాలంలో  కోడెల కుటుంబం సాగించిన  అరాచకాలతో రెండు నియోజకవర్గాల్లో బాగా డ్యామేజి జరిగిపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కోడెలే సత్తెనపల్లిలో ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. అయితే కోడెల వల్లే నియోజకవర్గంలో పార్టీకి చెడ్డ పేరొస్తోంది కాబట్టి ఆయన్ను తప్పించి మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగబాబుకు ఇన్చార్జి ఇవ్వాలని మెజారిటి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే విషయమై రాయపాటి వర్గంలో కొందరు చంద్రబాబునాయుడును కలిసి కోడెలను తప్పించే విషయాన్ని ప్రస్తావించారు. అయితే కోడెలను  తప్పించే విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదని సమాచారం. మరి ఇపుడు రాయపాటి రంగబాబు ఏం చేస్తారన్ని ఆసక్తికరంగా మారింది. పార్టీలోనే ఉంటూ కోడెల కు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తారని కొందరు అంటున్నారు. లేదు ఏకంగా టిడిపికే గుడ్ బై చెప్పేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి రాయపాటి సాంబశివరావుకు ఇపుడు టిడిపికి గుడ్ బై చెప్పేందుకు అవకాశం వచ్చింది. ఎటూ బిజెపిలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. బిజెపిలో కీలక నేత రామ్ మాధవ్ తో ఈమధ్యనే రాయపాటి భేటీ కూడా అయ్యారు.  వాళ్ళమధ్య జరిగిన చర్చల సారంశం బయటకు పొక్కలేదు కానీ రాయపాటి ప్యాకేజి డిమాండ్లపై బిజెపి నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ప్యాకేజీ గనుక ఫైనల్ అయితే వెంటనే రాయపాటి వర్గం మొత్తం బిజెపిలో చేరిపోవటం ఖాయం.