వైసిపి నేత చెయ్యి విరగొట్టిన పోలీసులు..చర్చ అంటే దౌర్జన్యమా?

అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఎదిరిస్తే, అభివృద్ధిపై వారిని సవాలు చేస్తే ఏమవుతుందో పోలీసులు స్వయంగా రుచి చూపించారు. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో అభివృద్ధిపై ఎంఎల్ఏ యామినీ బాలను చాలెంజ్ చేసినందుకు పోలీసులు ఈరోజు  వైసిపి సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేయిని విరగొట్టారు. పోలీసుల చర్యకు నిరసనగా వైసిపి నేతలు, కార్యకర్తలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలపటంతో టెన్షన్ మొదలైంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ఎంఎల్ఏ యామిని బాల, వైసిపి సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి  ఒకరికొకరు సవాళ్ళు విసురుకున్నారు. అభివృద్ధిపై చర్చించేందుకు నియోజకవర్గంలోని నార్పల గ్రామాన్ని వేదికగా ఇద్దరు ఎంచుకున్నారు. అనుకున్నట్లుగానే జొన్నలగడ్డ నార్పలకు చేరుకున్నారు. కానీ ఎంఎల్ఏ మాత్రం అడ్రస్ లేరు. దాంతో  జొన్నలగడ్డ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన తెలిపారు. అయితే, అక్కడే ఉన్న పోలీసులకు ఒళ్ళుమండిపోయింది. తెర వెనుక నుండి వచ్చిన ఆదేశాలతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగేశారు.

నిరసన తెలుపుతున్న కార్యకర్తలను లాగిపారేయటమే కాకుండా జొన్నలగడ్డను కూడా పక్కకు లాగేశారు. అంతేకాకుండా ఆమెను ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి పోలీసుజీపులోకి నెట్టారు. తనపై దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసులతో జొన్నలగడ్డ వాగ్వాదినికి దిగినా ఉపయోగం లేకపోయింది. పోలీసులు జీపులో తీసుకెళుతున్న క్రమంలో ఒక స్పీడ్ బ్రేకర్ వద్ద జీపు ఒక్కసారిగా పైకి ఎగిరింది. దాంతో జీపు తలుపు తెరుచుకుని పోలీసు ఒకరు బయటకు పడిపోయారు.

అయితే, తనని తాను రక్షించుకోవటంలో భాంగంగా ఆ పోలీసు పక్కనే కూర్చుని ఉన్న జొన్నలగడ్డ చేతిని ఊతంగా పట్టుకున్నారు. ఆ విసురుకు జొన్నలగడ్డ చేయిని గట్టిగా పట్టుకోవటంతో చెయ్యి విరిగిపోయింది. అలాగే దాదాపు 2 గంటల పాటు జొన్నలగడ్డను ఎక్కడెక్కడో తిప్పిన పోలీసులు చివరకు జొన్నలగడ్డ గొడవ చేయటంతో డాక్టర్ కు చూపించారు. అన్నీ పరీక్షలు చేసిన డాక్టర్ వైసిపి నేత చెయ్యి విరిగిందని చెప్పి కట్టుకట్టారు. 

అభివృద్ధిపై చర్చకు సవాలు చేస్తేనే అధికారపార్టీ నేతలు పోలీసులను పంపించి వైసిపి నేతలపై ధౌర్జన్యాలు చేయించటం విచిత్రంగా ఉంది. గతంలో కూడా గుంటూరు జిల్లాలోని  సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కూడా వైసిపి నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మొత్తానికి గాంధీ జయంతి రోజున జాతిపిత సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూని అయిపోయింది.