వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి ఎస్వీ వర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చారు.
గోశాలలో పదుల సంఖ్యలో గోవులు అకాల మరణం చెందడానికి అధికారుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లోపమే కారణమని, గోవులకు సరైన సంరక్షణ, వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీయగా, పలువురు ఆయన వ్యాఖ్యలను ఖండించారు.

ఈ నేపథ్యంలోనే, కొందరు వ్యక్తులు భూమనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, భూమన చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉంటే చూపాలని కోరుతూ ఆయనకు నోటీసులు జారీ చేశారు.
ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని పోలీసులు తమ నోటీసుల్లో స్పష్టం చేశారు. పోలీసుల విచారణకు భూమన హాజరవుతారా? లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

