చంద్రబాబు మెడకు పోలవరం అవినీతి

అధికారంలో ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టులో చేసిన అవినీతే చంద్రబాబునాయుడు మెడకు చుట్టుకునేట్లుంది. అసెంబ్లీ పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. ప్రాజెక్టు పనుల విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత సుమారు 1500 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు తనకు ప్రాధమికంగా అంచనాకు వచ్చినట్లు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై జగన్ నిపుణుల కమిటి వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని చంద్రబాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు నరేంద్రమోడి దగ్గర నుండి రాష్ట్రస్ధాయి బిజెపి నేతలు చాలామందే అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

అదే విషయాన్ని జగన్ ప్రస్తావిస్తు ప్రాజెక్టులో చంద్రబాబు చేసిన అవినీతిని 15 రోజుల్లో బయటపెట్టనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. నిపుణుల కమిటి మరో నాలుగు రోజుల్లో తనకు నివేదిక ఇస్తుందని తర్వాత దాన్ని బయటపెడతానని అసెంబ్లీలోనే జగన్ చెప్పటం గమనార్హం.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే పోలవరం అవినీతి తొందరలో చంద్రబాబు మెడకు చుట్టుకోవటం ఖాయమనే అనిపిస్తోంది. అవినీతికి బాధ్యునిగా ముందు చంద్రబాబును చూపించి తర్వాత సిబిఐతో విచారణ చేయించాలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఏదేమైనా తొందరలో టిడిపిలో సంచలనాలు నమోదవ్వటం ఖాయమనే అనిపిస్తోంది.