తునిలో యనమలకు షాక్ తప్పదా

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీలో సీనియర్ నేతగా చంద్రబాబునాయుడు కోటరీలో ముఖ్యుడిగా జిల్లాలో అపారమైన పెత్తనాన్ని చెలాయిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. నిజానికి యనమలకంటూ సొంతంగా బలమేమీ లేదు. పార్టీ గాలివీస్తే గెలుస్తారు లేకపోతే చతికిలపడటమే. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోవటంతో యనమల ప్రాభవం జిల్లాలో బాగా తగ్గిపోయింది. పార్టీలో సీనియర్ నేత అవ్వటమే కాకుండా సొంతంగా చెప్పుకోదగ్గ బలమైన నేత కాదు కాబట్టి చంద్రబాబు కోటరీలో చెలామణి అయిపోతున్నారు.

 

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వత్సవాయి శ్రీరాజ వత్సవాయి వెంకట కృష్టమరాజు చేతిలో యనమల ఓడిపోయారు. దాంతో 2014లో తన తమ్ముడు యనమల కృష్ణుడు పోటీ చేశారు. వైసిపి తరపున దాటిశెట్టి రాజ పోటీ చేసి  దాదాపు 18 వేల ఓట్ల మోజారిటీతో గెలిచారు. పోటీ చేసింది తమ్ముడు యనమల కృష్ణుడే అయినప్పటికీ రామకృష్ణుడు లేకపోతే కృష్ణుడు జీరేనే అన్న విషయం అందిరికీ తెలిసిందే. ఎప్పుడైతే రెండు ఎన్నికల్లో వరుసగా యనమల సోదరులు ఓడిపోయారో జిల్లాలో వాళ్ళ ప్రాభవం తగ్గిపోయింది. కాకపోతే పోయిన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎంఎల్సీ తీసుకుని మంత్రయ్యారు కాబట్టి జిల్లాలో రామకృష్ణుడు మాట చెలామణవుతోంది.

 

సరే  షెడ్యూల్  ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి తాజాగా తుని నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై  చర్చ జరుగుతోంది. యనమల సోదరులకు టిక్కెట్టు ఇవ్వటం చంద్రబాబుకు ఇష్టం లేదని జిల్లాలో బాగా ప్రచారం జరుగుతోంది. యనమల కుటుంబం నుండి కాకుండా వేరే నేతల్లో గట్టి వాళ్ళకెవరికైనా టిక్కెట్టిస్తే బాగుంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.

 

అయితే, తమకు కాకపోయినా తన కూతురుకైనా టిక్కెట్టు ఇప్పించుకోవాలని రామకృష్ణుడు పట్టుబడుతున్నారట. యనమల సోదరులైతే నేమి వాళ్ళ కూతురైతేనేమి ఎవరైరా ఒకటే కదా అన్నది పార్టీ నేతల వాదన. ఎందుకంటే, గడచిన నాలుగున్నరేళ్ళలో అందరిమీద ఉన్నట్లే యనమల కృష్ణుడుపైన కూడా ఆర్ధికపరమైన ఆరోపణలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయట. అడ్డదిడ్డమైన సంపాదనలో కృష్ణుడుపైన ఆరోపణలు వినిపిస్తున్నాయంటే రామకృష్ణుడు మద్దతు లేకుండానే ఉంటుందా ?