చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ మీడియా, సోషల్ మీడియా ఒత్తిడికి లొంగినట్లే కనబడుతోంది. ఆదివారం రాత్రి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో పవన్ మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీపై కాస్త విమర్శలు చేసినట్లు నటించారు. అదే విధంగా సోమవారం తెల్లవారి నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ, పవన్ ఇప్పటికీ కేంద్రంగా గట్టిగా మాట్లాడలేకపోతున్నారంటూ కాస్త మండిపడినట్లుగా లీకులిచ్చుకున్నారు.
అంటే ఇద్దరి వైఖరి చూస్తుంటే ఇద్దరూ కూడబలుక్కునే ’నేను టిడిపినంటాను, నువ్వు నన్ను విమర్శించు’ అన్నట్లుగా ఉంది వ్యవహారం. లేకపోతే మరో 16 రోజుల్లో పోలింగ్ పెట్టుకుని కేంద్రాన్ని పవన్ విమర్శిస్తే ఎంత ? విమర్శించకపోతే ఎంత ? ఆ విషయాన్ని చంద్రబాబు టెలికాన్ఫరెన్సులో నేతలతో ప్రస్తావించాల్సిన అంశమేనా ? నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతల పనితీరు ఎలాగుంది ? ఎక్కడెక్కడ వెనకపడ్డారు ? వైసిపి వ్యూహాలేంటి అనే కీలక అంశాలను వదిలిపెట్టి పవన్ గురించే మాట్లాడారంటే పెద్ద డ్రామానే కనిపిస్తోంది.
ఇక అవనిగడ్డలో పవన్ మాట్లాడుతూ, టిడిపి చెప్పినట్లు జనసేన నడుచుకుంటుందా ? అంటూ జనాలను అడగటమే పెద్ద జోక్. జనాలను పట్టించుకోని టిడిపితో తాను ఎందుకు కలుస్తానంటూ పవన్ సుతిమెత్తగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనం. లోలోపలేమో ఇద్దరూ అభ్యర్ధులను ఇచ్చిపుచ్చుకుంటున్న విషయం అందరికీ తెలిసిపోయింది. జనాలు ఆ విషయం గ్రహిస్తే ఇద్దరికీ మొదటికే మోసం వస్తుందని ఇద్దరు భయపడుతున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.
అందుకనే తామిద్దరూ ఒకటికాదు అని చెప్పేందుకు నానా అవస్తలు పడుతున్నారు. నిజానికి చంద్రబాబును విమర్శించాలంటే పవన్ కు చాలా అంశాలే కళ్ళెదుట కనిపిస్తోంది. అదేవిధంగా పవన్ లోని లోపాలను విమర్శించటానికి చంద్రబాబుకు కూడా బోలెడన్ని అవకాశాలున్నాయి. అయినా కానీ టిడిపి వాళ్ళెవరూ జనసేనను పట్టించుకోవటం లేదు. ఇక టిడిపి నేతలెవరూ పవన్ గురించి పల్లెత్తుమాట కూడా అనటం లేదు. ఇక్కడే తెలిసిపోతోంది చంద్రబాబు-పవన్ బంధం. మరి జనాలు ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే.