చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ వేసుకున్న ముసుగు తొలగిపోతోంది. దాంతో పవన్ విషయంలో కాపు సామాజికవర్గం పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరైపోతున్నట్లు సమాచారం. నిజాయితీగా పవన్ రాజకీయం చేస్తారని కాపులు అనుకున్నారు. అందుకనే మెజారిటీ కాపులు పవన్ ను సమర్ధించారు. అయితే, ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పవన్ నిజస్వరూపం బయటపడుతోంది. సీట్ల సర్దుబాటు విషయంతో పాటు జగన్ ను అటాక్ చేయటం దాకా చంద్రబాబు అడుగుజాడల్లోనే పవన్ నడుస్తున్న విషయం బయటపడుతోంది.
ఎప్పుడైతే పవన్ అసలురూపం బయటపడుతోందో కాపుల్లో భ్రమలు కూడా తొలగిపోతున్నాయట. అందుకనే పవన్ ను నమ్మేందుకు లేదని ఉభయగోదావరి జిల్లాల్లోనే చర్చలు మొదలయ్యాయట. కాపుల ప్రాబల్యమున్న ఉభయగోదావరి జిల్లాల్లోనే ఆ విధమైన చర్చలు జరుగుతున్నాయంటే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్ధితి చెప్పేదేముంది ?
చాలా కాలంగా చంద్రబాబంటే కాపులు మండిపోతున్నారు. కాపులను బిసిల్లో కలుపుతానని ఇచ్చిన హామీని పక్కనపెట్టేశారు. ఆ సందర్భంగా జరిగిన అల్లర్లలో రత్నాచల్ రైలును తునిలో ఆందోళనకారులు తగలపెట్టేశారు. రైలు దహనం ఘటన పులివెందుల గూండాల పని అంటూ జగన్ పై గుడ్డకాల్చి మీదేసేసింది ప్రభుత్వం. అయితే, ఆ ఘటనలో అరెస్టయిన వారంతా కాపు నేతలే కావటం గమనార్హం. కాపు ఉద్యమాన్ని అణిచేయటం కోసం చంద్రబాబు చాలామంది కాపు నేతలపై కేసులు పెట్టించారు.
కాపులను ఇంతగా సతాయించిన చంద్రబాబుకు పవన్ మద్దతు పలకటాన్ని కాపు నేతలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే జనసేనకు మద్దతుగా నిలవకూడదని కాపుల్లో చర్చలు జరుగుతున్నాయట. మరి ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ చర్చల జోరు పెరిగితే పాపం పవన్ పరిస్ధితి రాబోయే ఎన్నికల్లో ఘోరంగా తయారవటం ఖాయం. అందుకనే పవన్ కన్నా సోదరుడు చిరంజీవే నయమనే వాదన కూడా కాపుల్లో బయలుదేరింది. పాపం చంద్రబాబును నమ్ముకున్నందుకు పవన్ కు చివరకు మట్టే మిగిలేట్లుంది.