చంద్రబాబు..ఇంతకీ కాపులు బిసిలా ? అగ్రవర్ణాలా ?

ఇపుడిదే ప్రశ్న రాష్ట్రంలోని వారి బుర్రను తొలిచేస్తోంది. కాపులు ఇకనుండి బిసిలంటూ చంద్రబాబునాయుడు ఒకపుడు ప్రకటించేశారు. అదే చంద్రబాబు అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ లో 5 శాతం కాపుల్లోని పేదలకు వర్తించేయాలని తాజాగా నిర్ణయించారు. గతంలో కాపులకు బిసిల రిజర్వేషన్ వర్తింపచేస్తున్నట్లు రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. అదే తీర్మానంపై అసెంబ్లీలో చర్చలు జరిగి క్యాబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. క్యాబినెట్ తీర్మానాన్ని, అసెంబ్లీ ఆమోదాన్ని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపింది. క్యాబినెట్ తీర్మానాన్ని, అసెంబ్లీ ఆమోదంపై కేంద్రం స్పందన ఏమిటి అన్న విషయాన్ని పక్కనపెడదాం. ఎప్పుడైతే క్యాబినెట్ తీర్మానించేసి, అసెంబ్లీ ఆమోదించేసిందో ఇక నుండి కాపులంతా బిసిలే అన్నట్లుగా చంద్రబాబు అప్పట్లో పెద్ద బిల్డప్పే ఇచ్చారు.

ఇకేముంది, చంద్రబాబు భజన చేసే కాపు నేతలు, సంఘాలు వెంటనే చంద్రబాబునాయుడుకు పెద్ద ఎత్తున సన్మానం కూడా చేసేశారు. మంత్రివర్గంలోని మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు కూడా కాపు నేతలు సన్మానాలు చేశారు. సరే అప్పట్లో అదో పెద్ద ప్రహసనం లేండి. అయితే, ఆ తర్వాత కాపులకు బిసి రిజర్వేషన్ వర్తింపచేసే ఫైలును కేంద్రం తిప్పికొట్టింది. కేంద్రం తిప్పిపంపిన ఫైలు గురించి అడిగితే చంద్రబాబు అసలు స్పందించలేదు. దాంతో సన్మానం చేయించుకున్న చంద్రబాబుతో సహా  కాపు మంత్రులు, ఎంఎల్ఏలు కేంద్రం తిప్పిపంపిన బిల్లు గురించి ఎవ్వరూ నోరెత్తితో ఒట్టు. ఆ తర్వాత ఆ అంశం కోల్డు స్టోరేజీలో పడిపోయింది లేండి.

సీన్ కట్ చేస్తే రాబోయే ఎన్నికల్లో లబ్దిని దృష్టిలో పెట్టుకుని ఈమధ్యనే కేంద్రం అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ వర్తింప చేయాలని చట్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా గట్టెక్కాలో తెలీక అయోమయంలో ఉన్న చంద్రబాబుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం అడ్వాంటేజ్ గా కనిపించింది. ఇకేముంది ? వెంటనే అగ్రవర్ణాలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ లో 5 శాతం కాపులకు కేటాయించేట్లు, మిగిలిన 5 శాతాన్ని ఇతర అగ్రవర్ణాల్లోని పేదలకు వర్తింప చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. సరే మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయనుకోండి అది వేరే సంగతి. ఇక్కడే కాపు సంఘాల నేతలకు ఒక సందేహం వచ్చింది. అసలింతకీ కాపులు బిసిలా ? లేకపోతే అగ్రవర్ణాలా ? అని.