మంత్రి కాలువ శ్రీనివాస్ కు టెన్షన్ పెరిగిపోతోంది. అసలే ప్రభుత్వంపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. దానికితోడు పార్టీలో కూడా అసమ్మతి, వ్యతిరేకులు బాహాటంగా మంత్రి ఓటమికి శపథాలు చేస్తున్నారు. దాంతో మంత్రికి ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో మంత్రి వ్యతిరేకులంతా ఒక్కసారిగా యాక్టివ్ అవ్వటంతో చంద్రబాబు రంగంలోకి దిగినా ఉపయోగం కనబడటం లేదు.
నిజానికి రాయదుర్గంలో పోయిన ఎన్నికల్లోనే కాలువ అదృష్టం కొద్దీ గెలిచారు. వైసిపి అభ్యర్ధి కాపు రామచంద్రారెడ్డి కాస్త నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే కాలువ విజయం సాధించారు. అయితే తన గెలుపు మొత్తం తన సామర్ధ్యంతోనే సాధ్యమైందని అనుకోవటంతోనే సమస్య మొదలైంది. మొదట్లో చీఫ్ విప్ గా ఉన్నంత వరకూ బాగానే ఉన్నారు. ఎప్పుడైతే మంత్రి కూడా అయ్యారో అప్పటి నుండే నియోజకవర్గంలోని సీనియర్ నేతలతో విభేదాలు, అవినీతి ఆరోపణలు కూడా పెరిగిపోయాయి.
ఒకదశలో రాయదుర్గంలో గెలవటం కష్టమని అర్ధమయ్యే గుంతకల్ నియోజకవర్గానికి మారుదామని కూడా అనుకున్నారు కాలువ. కానీ చంద్రబాబు ఒప్పుకోకపోవటంతో చివరకు రాయదుర్గంలోనే పోటీ చేయాల్సొచ్చింది. అయితే, అప్పటికే నియోజకవర్గంలో మంత్రిపై మండిపోతున్న మాజీ ఎంఎల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఎంఎల్సీ దీపక్ రెడ్డి కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అయితే టికెట్ మంత్రికే చంద్రబాబు ఖరారు చేయటంతో మెట్టు పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు, ఎంపి జేసి దివాకర్ రెడ్డితో పాటు స్వయంగా కాలువే మాట్లాడినా మెట్టు మెట్టుదిగలేదు. అదే సమయంలో తాను ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు దీపక్ ప్రకటించటం పార్టీలో సంచలనం రేపుతోంది. దీపక్ స్వయానా జేసి మేనల్లుడే కావటంతో పోటీ నుండి తప్పుకోవచ్చేమో కానీ కాలువ గెలపుకైతే సహకరించరన్నది బహిరంగ రహస్యం. పాపం కాలువకు కష్టాలు తప్పేట్లు లేదు.