జనసేనాని యాత్ర సూపర్ హిట్టు.! ఆ ప్రకటన వస్తుందా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. కోనసీమలోని అమలాపురంలో తాజాగా జరిగిన వారాహి విజయ యాత్ర.. ఇప్పటిదాకా జరిగిన బహిరంగ సభలన్నిటిలోకీ అతి పెద్ద హిట్టు.!

ఈసారి మహిళలు పోటెత్తారు. హారతులిచ్చారు. యువత కేరింతలు మామూలే. వృద్ధులూ జనసేనాని సభల్లో కనిపిస్తుండడం గమనార్హం. అయితే, వాళ్ళంతా ఓటర్లుగా మారి, జనసేనకు ఓటు బ్యాంకు అవుతారా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

రాజోలు నియోజకవర్గం వైపుగా జనసేనాని వారాహి విజయ యాత్ర సాగుతోంది. ఆ తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెడుతుంది ఈ యాత్ర. తర్వాతేంటి.? భీమవరంలో పోటీపై జనసేనాని స్పష్టతనిస్తారా.?

నిజానికి, కత్తిపూడి నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన అభ్యర్థుల్ని ప్రకటించడం మొదలు పెట్టి వుండాలి. అంతకన్నా శుభకరమైన సందర్భం ఇంకేముంటుంది.? కానీ, టీడీపీతో పొత్తు ప్రయత్నాల నేపథ్యంలో జనసేనాని ఆచి తూచి అడుగులేస్తున్నారు.

యాత్ర జరిగిన అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీనే పోటీ చేసే అవకాశం వుందని, టీడీపీ శ్రేణులు కూడా ఓ నిర్ణయానికి వచ్చేశాయట. అయితే, ఈ విషయం పైకి ఒప్పుకోవడంలేదు టీడీపీ. ఇదో చిత్రం.

యాత్ర కోసం జనాన్ని ప్రత్యేకంగా సమీకరించాల్సిన అవసరం జనసేనకు లేదు. కాకపోతే, ఖర్చులుంటాయ్ కదా.! అవి తడిసి మోపెడవుతున్నాయ్. గతానికి భిన్నంగా ఈసారి స్థానిక నాయకత్వం కూడా గట్టిగానే ఖర్చు చేస్తోందిట జనసేన వారాహి విజయ యాత్రల కోసం.