టిడిపి, వైసిపి అసంతృప్తులకు జనసేన గాలం

రీసెంట్ గా పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ ను ముందుపెట్టి ఇతర పార్టీల్లోని నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాలం వేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ జనసేనకు గట్టి అభ్యర్ధులు లేరన్న విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు కొత్త వాళ్ళను చేర్చుకుని టిక్కెట్లిచ్చే పరిస్ధితి కనిపించటం లేదు. కాబోయే ముఖ్యమంత్రి తానే అనుకుంటున్న పవన్ కొత్త వారిని రంగంలోకి దింపి ప్రయోగాలు చేసే స్ధితిలో లేరు. అందుకనే ఇతర పార్టీల్లోని నేతలకు, అసంతృప్త నేతలకు గాలమేస్తున్నట్లు సమాచారం. అందుకని కమ్మ సామాజికవర్గంలోని నేతలకు మనోహర్ ద్వారానే గాలమేస్తున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు.

 

నిజానికి ఇటు తెలుగుదేశంపార్టీ అటు వైసిపిల్లో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కే అవకాశాలు లేవు అనుకున్న నేతలనే జనసేన టచ్ చేస్తోంది. అందులో భాగంగానే ముందుగా గుంటూరు, కృష్ణా జిల్లాల నుండే ప్రయత్నాలు మొదలుపెట్టారట. మనోహర్ తో మాట్లాడించటం వల్ల ఏ పదిమంది గట్టి నేతలను జనసేనలోకి తీసుకున్నా చాలని పవన్ భావిస్తున్నారట. రెండుసార్లు ఎంఎల్ఏగా, ఒకసారి ఫుల్ టైం స్పీకర్ గా పనిచేసినందు వల్ల చాలామంది ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలతో మనోహర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ సంబంధాలను ఉపయోగించుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు.

 

గుంటూరు జిల్లాలోని రేపల్లె మాజీ ఎంఎల్ఏ దేవినేని మల్లికార్జున్ ప్రస్తుతం టిడిపిలో ఉన్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. పార్టీ నాయకత్వంపై ఎటూ దేవినేని కూడా అసంతృప్తిగా ఉన్నారు. చిలకలూరిపేటలో వైసిపి సీనియర్ నేత, మాజీ సమన్వయకర్త మర్రి రాజశేఖర్ కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. నాలుగేళ్ళు సమన్వయకర్తగా పనిచేసిన మర్రిని జగన్ అర్ధాంతరంగా తొలగించినప్పటి నుండి మండిపోతున్నారు.

 

సత్తెనపల్లి మాజీ ఎంఎల్ఏ యర్రం వెంకటేశ్వరరెడ్డి కూడా వచ్చే ఎన్నకలకు రెడీ అవుతున్నారు. ఇటువంటి వాళ్ళందరితోను మనోహర్ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి, వైసిపిల్లో టిక్కెట్లు దక్కే అవకాశాలు లేవనుకున్న నేతలతో మనోహర్ మాట్లాడుతున్నారు. మరి మనోహర్ ప్రయత్నాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.