క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు అనే సామెతుంది మనకు. అదే విధంగా కేంద్రంప్రభుత్వం చేతికి చంద్రబాబునాయుడు లడ్డూలాగ దొరికినట్లైంది. చంద్రబాబును సిబిఐ విచారణలో ఇరికించేందుకు కేంద్రప్రభుత్వానికి భలే అవకాశం దొరికింది. నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనపై విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. స్వయంగా బిజెపి నేతలే కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అయినా చంద్రబాబుపై సిబిఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అన్ని అవినీతి ఆరోపణలున్నా కేంద్రం సిబిఐ విచారణ ఎందుకు చేయించటంలేదు ?
ఎందుకంటే, రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశాలపై సిబిఐ విచారణ జరగాలంటే అందుకు రాష్ట్రప్రభుత్వం సిఫారసు చేయాలి. లేకపోతే సిబిఐ విచారణకు హైకోర్టన్నా ఆదేశించాలి. మొదటిది జరిగేది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక, రెండో విషయంపై ఇంత వరకూ ఎవరు దృష్టి పెట్టలేదు. కాకపోతే పై రెండు మార్గాల్లో కాకుండా కేంద్రం తనంతట తానుగా సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఇంతకాలానికి వచ్చింది. అదికూడా చంద్రబాబు కేంద్రబిందువుగా ఆరోపణల నేపధ్యంలో.
మొన్న 25వ తేదీన విశాఖపట్నం విమానశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్న జరిగిన విషయం తెలిసిందే. హత్యాయత్నం ఘటనపై వైసిపి నేతలు ఒకవైపు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో దాడి ఘటనను మొత్తం డ్రామాగా స్వయంగా చంద్రబాబే ఎగతాళి చేస్తున్నారు. తనపై తానే జగన్ దాడి చేయించుకున్నాడంటూ చంద్రబాబు, మంత్రులు వైసిపిపై ఎదురుదాడి చేస్తున్నారు. అంటే మొత్తం ఘటనలో పూర్తి కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. అదే సమయంలో హత్యాయత్నం ఘటనపై కోర్టుకు పోలీసులు రిమాండ్ రిపోర్టు అందించారు. ఆ రిపోర్టులో జగన్ పై జరిగింది హత్యాయత్నమే అంటూ పోలీసులు స్పష్టంగా చెప్పారు.
అంటే పోలీసు బాసు డిజిపి ఠాకూర్ ఒకలాగ, ముఖ్యమంత్రి, మంత్రులు ఇంకోలాగ చెబుతున్నారు. అదే సమయంలో వైసిపి నేతల ఆందోళనకు మద్దతుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు మరోలాగ చెప్పారు. దాంతో వాస్తవాలేంటో జనాలకు పూర్తిగా అర్ధం కావటం లేదు. అయితే మొత్తం ఘటనపై చంద్రబాబు సిట్ విచారణ చేయిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం చేయించే విచారణపై తమకు నమ్మకం లేదని వైసిపి నేతలు వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపధ్యంలొనే వైసిపి మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదుకాబట్టి స్వతంత్ర సంస్ధతో కానీ జ్యుడీషియల్ విచారణ కానీ చేయించాలని పిటీషన్లో కోరారు. అదే సమమంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. సిబిఐ విచారణకు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
హై కోర్టు కానీ లేదా రాజ్ నాథ్ సింగ్ కానీ వైసిపి నేతల డిమాండ్ కు సానుకూలంగా స్పందిస్తే చంద్రబాబు పరిస్ధితి చాలా అసహ్యంగా ఉంటుందనటంలో సందేహమే లేదు. హత్యాయత్నం ఘటన జరిగింది కేంద్రప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయంలో కాబట్టి సిబిఐ విచారణకు కేంద్రమే నిర్ణయం తీసుకోవచ్చు. అదే గనుక జరిగితే సిబిఐ విచారణ మొదలవుతుంది.
ఒకే ఘటనపై రెండు దర్యాప్తు సంస్ధలు విచారణ జరిపేందుకు లేదు. కాబట్టి చంద్రబాబు వేసిన సిట్ దర్యాప్తు ఆగిపోతుంది. ఒకసారంటూ సిబిఐ విచారణ మొదలైతే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటుందో ఎవరూ ఊహించలేకున్నారు. మొత్తానికి సిబిఐ చేతిలో చంద్రబాబు ఇరుక్కునేందుకే అవకాశాలు ఎక్కువున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.