గుంటూరు… జగన్ కొత్త ఫార్ములా ట్రై చేస్తున్నారా?

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఇప్పుడు అటు అధికార పక్షానికీ, ఇటు విపక్షాలకూ హాట్ టాపిక్ గా మారింది. ఏ స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంపై అధికార పార్టీలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయని తెలుస్తున్న వేళ.. టీడీపీ కూడా దానికి అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. అభ్యర్థులను మారుస్తుందని అంటున్నారు. ఈ సమయంలో గుంటూరు లోక్ సభ స్థానం తెరపైకి వచ్చింది.

ఏపీలో కీలక లోక్ సభ స్థానాల్లో గుంటూరు కూడా ఒకటి. ఈ స్థానాన్ని రాష్ట్ర విభజన అనంతరం రెండుసార్లూ టీడీపీ కైవసం చేసుకుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ కీలక నేత గల్లా జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా… 69,222.. 4,205 మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈ దఫా ఆయన పోటీలో ఉండరని తెలుస్తుంది. దీంతో ఇక్కడ టీడీపీ ఎవరిని నిలబెట్టబోతుంది అనే చర్చ తెరపైకి వచ్చింది.

మరోపక్క లగడపాటి రాజగోపాల్ ను గుంటూరు ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో సామాజిక సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన గల్లా జయదేవ్ పోటీ చేయగా.. వైసీపీ నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరి పోటీచేశారు. అంటే… 2014లో పోటీ కమ్మ వర్సెస్ కమ్మ గా సాగిందన్నమాట!

ఇక 2019 విషయానికొస్తే వైసీపీ సామాజిక సమీకరణలు మార్చింది. ఇందులో భాగంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన గల్లా జయదేవ్ పై మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని రంగంలోకి దింపింది. అంటే… కమ్మ వర్సెస్ రెడ్డి ఈక్వేషన్స్ ని వైసీపీ ప్రయోగించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో 4,205 ఓట్ల తేడాతో వైసీపీ నేత ఓటమి పాలయ్యారు.

ఈ క్రమంలో ఈసారి మరో కొత్త ఈక్వేషన్ ని జగన్ ట్రై చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకూ 2014లో కమ్మ వర్సెస్ కమ్మ.. 2019 లో కమ్మ వర్సెస్ రెడ్డి ఫార్ములాతో నడిచిన పోటీ… ఈ దఫా కమ్మ వర్సెస్ కాపు గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తే అతనిపైకి వైసీపీ నుంచి టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడిని పోటీకి నిలిపే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఫలితంగా… రెండుసార్లు దక్కని గుంటూరు లోక్ సభ స్థానాన్ని ఈదఫా కైవసం చేసుకోవాలని వైసీపీ భావిస్తుందని అంటున్నారు. వాస్తవానికి అంబటి రాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినా… అతడిని కుల నాయకుడిగా చూసే అవకాశం ఆల్ మోస్ట్ ఉండదనే వాదన బలంగా వినిపిస్తుంది. అతడిని యువకుడిగా, టీం ఇండియా మాజీ ప్లేయర్ గా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ గా చూస్తారనేది పరిశీలకుల అభిప్రాయంగా ఉంది. దీంతో ఈ ఫార్ములా కలిసొచ్చేదిగా వైసీపీ భావిస్తుందని అంటున్నారు.