వారాహి.! నారాహి.! ఏది నిజం.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ ప్రారంభించారు. మామూలుగా అయితే, ఏ రాజకీయ పార్టీ అయినా, ‘మేం అధికారంలోకి వస్తాం’ అని నినదిస్తుంది. జనసేన పార్టీ భావజాలం వేరేలా వుంది. వైసీపీని గద్దెనెక్కనివ్వబోం.. అని 2019 ఎన్నికల సమయంలో నినదించింది జనసేన. ఇప్పుడేమో, వైసీపీని గద్దె నుంచి దించుతాం.. అంటోంది అదే జనసేన పార్టీ.

ఇక్కడే జనసేన పార్టీ శ్రేణులు ఒకింత గందరగోళంలోకి వెళ్ళిపోతున్నాయి. ‘జై జనసేన.. అధికారంలోకి మేమే వస్తాం..’ అని నినదించాల్సిన జనసైనికులు, తమ అధినేత ఎలాంటి ‘పిలుపునిస్తాడో’ అర్థం కాక సతమతమవుతున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను తాను ప్రాక్టికల్ పొలిటీషియన్.. అని చెప్పుకుంటుంటారు. అదే అసలు సమస్య. ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుకుంటే రాజకీయాలు చేయడం కష్టం. ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేకపోయినా, అధికారంలోకి వస్తామనే భరోసా.. పార్టీ శ్రేణులకు ఇవ్వగలగలి.

ఇప్పుడిక వారాహి యాత్రంలో జనసేనాని ఏమని నినదిస్తారు.? మేమే అధికారంలోకి వస్తామని అనగలరా.? ‘నేనే ముఖ్యమంత్రినైతే..’ అని ఎన్నికల హామీలు ఇవ్వగలరా.? ‘టీడీపీతో పొత్తు ఖచ్చితంగా పెట్టుకుంటాం..’ అని చెప్పడంతోనే, ‘నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను’ అనే సంకేతాలు ఆల్రెడీ జనసేనాని పంపేశారు.

జనసేనాని ఆలోచనలు ఎలా వున్నా, ఆయన రాజకీయ వైఫల్యాలు ఎలా వున్నా.. జనసైనికుల్లో ఉత్సాహమైతే తగ్గడంలేదు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాని ‘వారాహి విజయ యాత్ర’ బంపర్ హిట్ అవడం ఖాయం.! సినిమా హిట్టు సరే.. సీట్ల సంగతేంటి.?