అశోక్ ఉండవల్లిలోనే ఉన్నాడా ?

తెలుగుదేశంపార్టీ వర్గాలిచ్చిన సమాచారం ప్రకారం అవుననే అనుకోవాలి. ఎప్పుడైతే హైదరాబాద్ లో ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్ డేటా చోరీ వ్యవహారం బయటపడిందో వెంటనే కంపెనీ ఓనర్ అశోక్ మాయమైపోయాడట. పోలీసులు ఫిర్యాదు తీసుకుని, కేసు కట్టి దర్యాప్తు మొదలు పెట్టేసరికే అశోక్ హైదరాబాద్ ను వదిలేసినట్లు సమాచారం.

డేటా చోరీ స్కాంలో ప్రధాన సూత్రదారులు చంద్రబాబునాయుడు, లోకేష్ అని ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే టిడిపిలోని ముఖ్యనేతలే అశోక్ ను వెంటనే హైదరాబాద్ నుండి పిలిపించేసినట్లు తెలుస్తోంది. తెలంగాణాలో ఎక్కడా సురక్షితం కాదు కాబట్టి వెంటనే ఏపికి రప్పించుకున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలోని సేఫ్ ప్లేస్ లో అశోక్ ను ఉంచారట. ఇక్కడికైతే తెలంగాణా పోలీసులు రాలేరని వచ్చినా అరెస్టులు చేయలేరని టిడిపి నమ్మకం.

అయితే అదే సమయంలో ఇదే విషయమై తెలంగాణా పోలీసులకు కూడా పక్కా సమాచారం ఉందట. టిడిపిలోని ముఖ్యులే అశోక్ ను అమరావతి ప్రాంతంలో దాచిపెట్టినట్లు ఆచూకీ అందుకున్నారట. ఎందుకంటే, గతంలో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసులో కీలక వ్యక్తి అయిన ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్యను కూడా అప్పట్లో ముఖ్యనేతలు ఇదే విధంగా దాచిపెట్టారు. కాబట్టి ఇపుడు కూడా అశోక్ ను ముఖ్యనేతే షెల్టర్ ఇస్తున్నారనే అనుమానం ఉంది. దాంతో అశొక్ ను ఎలా బయటకు రప్పించాలో అర్ధంకాక తెలంగాణా పోలీసులు తలలు పట్టుకున్నారు