వాళ్ళని వదిలించుకోవడం కరెక్టేనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డీ.!

ఎన్నికల సందడి మొదలైంది కదా.! రాజకీయ నాయకులు ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు జంపింగులు చేయడం మామూలే.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదికార వైసీపీ నుంచి కూడా ఇతర పార్టీల్లోకి వలసలు షురూ అయ్యాయి.

ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి విపక్షాల్లోకి వెళ్ళడం ఖచ్చితంగా అధికార పార్టీకి దెబ్బే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పైగా, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి లాంటి నేతలు వైసీపీని వీడుతున్నారంటే, వైసీపీ అధినాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి.

వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నప్పుడు, పార్టీలో అసలంటూ అసంతృప్తి అనేదే లేకుండా చూసుకోవాలి. కానీ, ఇక్కడ జరుగుతున్నది వేరే.! ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, వైసీపీలో కీలక నేతగా వుండేవారు.

చంద్రబాబు మీద రకరకాల కేసులు వేసింది ఆయనే. అదీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతోనే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటు అయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీని వీడితే, అధినేత వైఎస్ జగన్ ఎందుకు స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు.? సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి.. వీళ్ళెవరూ ఫక్తు రాజకీయ నాయకులు కారు. వారికి పార్టీలో పెత్తనం.. ముఖ్య నేతలు పార్టీ వీడేలా చేస్తోందా.? అన్న చర్చ జరుగుతోంది.

వైసీపీ వెంట విజయమ్మ లేరు, షర్మిల కూడా లేరు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే. ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీ మారబోతున్నారట. టిక్కెట్టు ఖాయమైనా వంగా గీత, పక్క చూపులు చూస్తున్నారట. ఇవన్నీ దేనికి సంకేతం.?

పెయిడ్ సర్వేల్ని పక్కన పెడితే, సాధారణ సర్వేల్లో వైసీపీకి రేటింగులు చాలా దారుణంగా వుంటున్నాయ్. ఈ పరిస్థితుల్లో ముఖ్య నేతల్ని వదిలించుకోవడం పార్టీకి చాలా చాలా దెబ్బే.!