Gautam Sawang : గౌతమ్ సవాంగ్ రగడ చల్లారినట్టేనా.?

Gautam Sawang :  సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన. ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్‌గా పనిచేసి, ఆ పదవి నుంచి అనూహ్యంగా బదిలీ చేయబడ్డారు. ఈ వ్యవహారంపై పెద్దయెత్తున రచ్చ జరగడంతో, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఆయన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. అన్యమనస్కంగానే గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించారన్నది రాజకీయ వర్గాల్లోనే కాదు, ఐపీఎస్ అలాగే ఐఏఎస్ అధికారుల్లోనూ జరుగుతున్న చర్చ.

దాదాపు 17 నెలల సర్వీసుని వదులుకుని, గౌతమ్ సవాంగ్.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి పొందడమేంటి.? అన్న విమర్శ విన్పిస్తోంది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అయితే, ఒకింత దారుణంగానే ఈ వ్యవహారంపై స్పందించారు. ‘ఇంతలా దిగజారిపోవాలా.? ఇలాంటి పదవుల కోసం అధికార పార్టీకి ఇన్నాళ్ళూ కొమ్ముకాశారా.?’ అంటూ గౌతమ్ సవాంగ్ మీద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేస్తున్నారు.

సరే, గౌతమ్ సవాంగ్ విషయంలో అధికార వైసీపీ వ్యవహరించిన తీరు ఏంటి.? ప్రభుత్వ పెద్దలు ఆయన్ని అవమానించారా.? గౌరవించారా.? అన్న విషయాల్ని పక్కన పెడితే, సర్వీసు వుండగానే.. పోస్టింగ్ ఇవ్వకుండానే డీజీపీ పోస్ట్ నుంచి తొలగించారన్న వాదనైతే జనంలోకి బలంగా వెళ్ళిపోయింది.

కొందరు పోలీస్ అధికారులు ఆయా ప్రభుత్వాల్లో, అధికార పార్టీకి కొమ్మకాశారనే విమర్శల్ని ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు కావొచ్చు, డీజీపీలుగా పనిచేసిన కొందరు అధికారులు కావొచ్చు.. ఈ తరహా విమర్శలే ఎదుర్కొన్నారు.

రాజకీయాలంటేనే అంత. ఇప్పుడున్న రాజకీయాల్లో.. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులపై రాజకీయ మచ్చ పడకుండా వారి రిటైర్మెట్ జరగడం అనేది దాదాపు అసాధ్యమే అయిపోయింది.