వైసిపికి వైవి రాజీనామా చేస్తారా ? మద్దతు దారులతో సమావేశం

ప్రకాశం జిల్లా వైసిపిలో సంచలన రేగనుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరుగుతున్నాయి. ఒంగోలు ఎంపి టికెట్ గనుక దక్కక పోతే ఇండిపెండెంట్ అభ్యర్దిగా అయినా పోటీ చేయాలని మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. వైవి అంటే జగన్ కు దగ్గరి బంధువన్న విషయం అందరికీ తెలిసిందే.

ఒంగోలు టికెట్ విషయంలో జగన్, వైవిల మధ్య విభేదాలు మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు టికెట్ వైవికి ఇవ్వటానికి జగన్ ఇష్టపడటం లేదు. ఎన్నికల్లో పాల్గొనటం కాకుండా అభ్యర్ధులను సమన్వయం చేసే బాధ్యత జగన్ అప్పగించారట. అయితే, వైవి దృష్టి మొత్తం పోటీపైనే ఉంది. అందుకనే టికెట్ కోసం పట్టుబడుతున్నారు.

అయితే, టిడిపి ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని వైసిపిలోకి చేర్చుకుని ఎంపిగా పోటీ చేయించాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. దానికి తగ్గట్లే మాగుంట కూడా తొందరలో వైసిపిలో చేరుతారనే ప్రచారం జిల్లాలో బాగా ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. అంటే జగన్ దృష్టంతా మాగుంటను చేర్చుకుని పోటీ చేయించటంపై ఉంటే వైవి ఆలోచనంతా ఎలాగైనా టికెట్ సాధించుకోవాలనే ఉంది.

అయితే టికెట్ ఇచ్చేది జగనే కాబట్టి పోటీ చేసే అవకాశం మాగుంటకే ఉంది. అదే నిజమైతే వైవి ఇండిపెండెంట్ గా పోటీ చేయటం ఖాయమట. అందులో భాగంగానే వైవి తన మద్దతుదారులతో సమావేశాలు పెడుతున్నారని తెలుస్తోంది. టికెట్ పై విభేదాలతోనే  జగన్ నూతన గృహప్రవేశానికి కూడా వైవి కుటుంబం హాజరుకాలేదట. మరి వైవి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే జనాలు ఆధరిస్తారా ?